బీఆర్ఎస్‌ను కూలగొడతాం- షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ను చాలెంజ్ చేస్తున్నా. తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారు.

Mohammed Ali Shabbir (Photo Credit : Google)
Mohammed Ali Shabbir : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి వస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ను కూలగొడతామని తేల్చి చెప్పారు. కురియన్ కమిటీ ముందు హాజరయ్యారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల తేడా అడిగారని తెలిపారు. నిజామాబాద్ లో ఏం జరిగిందని అడిగారు. నిజామాబాద్ అర్బన్ లో 17 వేల మెజారిటీ వచ్చిందని చెప్పానన్నారు. ”కామారెడ్డిలో పార్లమెంట్, అసెంబ్లీలో మెజారిటీ చెప్పాను. మొత్తం 36 ఓట్లు పెరిగాయని చెప్పా. ఉదయమే బీఆర్ఎస్ ఏజెంట్లు బూత్ నుండి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి వేశారని చెప్పా. బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి 27 లీడ్ వచ్చింది. పార్లమెంట్ లో 18వేల మైనస్ ఓట్లు పడ్డాయని చెప్పాను.
కేటీఆర్ కంటే నేను సీనియర్ లీడర్ ని. మంత్రిగా కూడా సీనియర్ ని. ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ను చాలెంజ్ చేస్తున్నా. తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారు. 46 మందిని రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురిని చేర్చుకుని పార్టీని విలీనం చేశారు. ఎమ్మెల్సీలను అలాగే చేర్చుకున్నారు. ఇది వాస్తవం అవునా కాదా? నేను రుజువు చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. కేటీఆర్ రుజువు చేయాలి. చేయకుంటే రాజీనామా చేయాలి.
ఈ విషయం గురించి నేను కేటీఆర్ కు ట్వీట్ చేశా. నా అకౌంట్ ని బ్లాక్ చేశాడు. అందరినీ అంగట్లో కొన్నట్లు కొన్నారు. మా పార్టీని కూలగొట్టారు. మేము కూడా బీఆర్ఎస్ ను కూలగొడతాం. త్వరలో అందరూ కాంగ్రెస్ లోకి వస్తారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారు”
Also Read : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం బెడిసికొట్టిందా? కొత్త సమస్య తెచ్చి పెట్టిందా?