తెలంగాణాపై కరోనా పంజా : ఇద్దరు డాక్టర్లకు వైరస్ లక్షణాలు

  • Published By: madhu ,Published On : March 26, 2020 / 09:00 AM IST
తెలంగాణాపై కరోనా పంజా : ఇద్దరు డాక్టర్లకు వైరస్ లక్షణాలు

Updated On : March 26, 2020 / 9:00 AM IST

తెలంగాణ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కుత్బుల్లాపూర్ నివాసికి, దోమల్ గూడకు చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా సోకిందని డాక్టర్లు నిర్ధారించారు.

ఈ మూడు కేసులు కాంటాక్ట్ కేసులు కావడంతో టెన్షన్ పెరుగుతోంది. వైరస్ సోకిన వ్యక్తితో దగ్గరగా ఉండడంతో వైద్య దంపతులకు ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కాంటాక్ట్ కేసులు 9కి చేరినట్లైంది. మొత్తంగా 44 కేసులు నమోదయ్యాయి. వైద్య దంపతులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారనే సంగతి తెలవడం లేదు. 

విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ సోకింది. వీరి ద్వారా సన్నిహితంగా ఉన్న వారికి వైరస్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం సెకండ్ స్టేజ్ లో ఉన్న ఈ వైరస్ థర్డ్ స్టేజ్ కు వెళుతుందా అనే భయం అందరిలో నెలకొంటోంది. ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు.