తెలంగాణాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే 61 కేసులు

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 02:10 AM IST
తెలంగాణాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే 61 కేసులు

Updated On : April 14, 2020 / 2:10 AM IST

తెలంగాణలో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్‌ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ  ఆదివారం 28 కొత్త కేసులతో మళ్లీ కలవరపాటుకు గురిచేసింది. ఇక సోమవారమైతే ఏకంగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు వచ్చిన కేసులన్నీ మర్కజ్‌ లింకులే అని సరిపుచ్చుకున్నా.. ఇప్పుడు కొత్త కేసులు తెరపైకి రావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.  

2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఒక్కరోజే 61 కేసులు నమోదుకావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. ఇక కరోనాతో మరొకరు చనిపోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 472 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్న సమయంలో… ఒక్కసారిగా ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.

తెలంగాణలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. ఏప్రిల్‌ 3వ తేదీన అత్యధికంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5వ తేదీన 62 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇక ఏప్రిల్ 13వ తేదీ సోమవారం  ఏకంగా 61 కేసులు నమోదు కావడం… అందరినీ టెన్షన్‌కు గురిచేస్తోంది. మార్చి 2న  తెలంగాణలో తొలి కేసు నమోదైతే.. ఆరువారాల్లో బాధితులు 592కు చేరారు. 

ఇప్పటికే మర్కజ్‌ లింకులున్న అందరికీ పరీక్షలు పూర్తయిపోయాయి. దీంతో ఇక క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే ఈనెల 10, 11 తేదీల్లో కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపించింది. ఈలోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేవ్‌బంద్‌ సభలకు వెళ్లొచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పోలీస్‌లు… ఆ సభలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. పరిస్థితి మళ్లీ తీవ్రమవుతుండడంతో.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.