తెలంగాణాలో కరోనా : ఆ నాలుగు జిల్లాల్లో కేసులు అత్యధికం

తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం పరిస్థితి రోజురోజుకు చేయిదాటుతోంది. దీంతో ఈ జిల్లాల్లో కేసులు అధికంగా నమోదుకావడానికి కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలతో పోలిస్తే, ఈ 4 జిల్లాల్లోనే మూడో వంతు వరకు నమోదయ్యాయి. ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆరుగురి ద్వారా ఏకంగా 81 మందికి కరోనా అంటుకుంది. ఒక్క చార్మినార్ ప్రాంతంలోనే 143 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. 30 సర్కిళ్లలో డీఎంహెచ్‌వో ప్రత్యేకాధికారులను నియమించారు. కంటైన్మెంట్ జోన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లి వయసు వారీగా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులుంటే, వారి వివరాలు సేకరించి వారికున్న అనారోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. అనుమానం వస్తే పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు పలువురు నేతలతో చర్చించారు. (రామగుండంలో విషాదం : గనిలోనే సింగరేణి కార్మికుడు సంజీవ్ మృతి)
వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. అక్కడి యంత్రాంగానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. మర్కజ్ కాంటాక్టు వ్యక్తులను వేగంగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిఘా పెంచాలని కోరింది. అనుమానితులు ఉంటే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి.
సూర్యాపేట జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. 10 మంది మర్కజ్‌కు వెళ్లిరాగా, అందులో ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు కన్పించాయి. వారిలో ఒకరు సూర్యాపేట పట్టణానికి చెందినవారైతే….. మరొకరు ఆ జిల్లాలో ఓ మండలానికి చెందిన వ్యక్తి. సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారానే 38 మందికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగించింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్టు ద్వారా మార్కెట్ బజార్‌లోని ఓ కిరాణా వ్యాపారికి కరోనా వచ్చింది. ఈ వ్యాపారి నుంచి అతడి కుమార్తెకు, మార్కెట్‌లో చేపలు, కూరగాయలు, పొగాకు అమ్మే వ్యాపారులకు.. వారి నుంచి కుటుంబ సభ్యులకు ఇలా 38 మందికి వైరస్ సోకింది.