పరువు పోతుందని కరోనా బాధితుడు ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 10:19 AM IST
పరువు పోతుందని కరోనా బాధితుడు ఆత్మహత్య

Updated On : July 22, 2020 / 12:22 PM IST

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు.

హోం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పడంతో మనస్తాపం:
మృతుడి పేరు జనార్దన్ రెడ్డి. జనార్దన్ కొంత కాలంగా కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. అతడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఎవరికీ చెప్పకుండా సిటీ నుంచి స్వగ్రామం మడిపల్లికి వెళ్లాడు. అతడికి పాజిటివ్ అని తెలియడంతో స్థానిక అధికారులు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. దీంతో జనార్దన్ మనస్తాపం చెందాడు. తన పరువు పోయినట్టు ఫీల్ అయ్యాడు. ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. జనార్దన్ రెడ్డి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంత పని చేశాడు అని వాపోయారు.

కరోనా, పరువు సమస్య కాదు:
జనార్దన్ తీరు చర్చకు దారితీసింది. కరోనా వస్తే పరువు పోతుందా? ఆత్మహత్య చేసుకోవాలా? అని విస్తుపోతున్నారు. జనార్దన్ ఆలోచనా విధానాన్ని స్థానికులు, అధికారులు తప్పుపట్టారు. కరోనా సోకడం నేరమేమీ కాదన్నారు. దాని వల్ల పరువేమీ పోదన్నారు. ఇతరులకు కరోనా సోకకుండా ఉండేందుకే హోం క్వారంటైన్ లో ఉండాలని చెబుతామని, అంతమాత్రాన పరువు తీసినట్టు కాదని అధికారులు వివరించారు. ఇలాంటి ఆలోచనా విధానం కరెక్ట్ కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని, ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని చెప్పారు. కరోనా కూడా ఇతర సాధారణ వ్యాధి లాంటిదే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీన్ని పరువు సమస్యగా అస్సలు చూడొద్దని కోరారు.