Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి?

Osmania Hospital: వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు మెడికోలకు..

Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి?

CORONA

Updated On : December 26, 2023 / 5:03 PM IST

Covid-19: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషంట్లు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్సకు చేరారు వారిద్దరు. అనంతరం వారికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో ఒకరికి 60, మరొకరికి 42 సంవత్సరాలు.

వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. పరిస్థితి విషమించి రోగి మృతిచెందినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. మరో రోగి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారిలో ఒకరు గుండెపోటుతో చనిపోయారని సూపరింటెండెంట్ నాగేంద్ర వెల్లడించారు. కరోనాతో చనిపోయాడన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

వారిద్దరికీ కరోనా ఉన్నట్లు గుర్తించామని, వారు మరణాలకు కరోనా కారణం కాదని అన్నారు. ఆసుపత్రిలో ఇద్దరు పీజీ మెడికోలకు కూడా పాజిటివ్ వచ్చిందని, వారు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. తెలంగాణలో కరోనా కేసులు ఇప్పటికే 50 దాటాయి.

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ అంతగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Covid Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి