తెలంగాణలో కోవిడ్ కలకలం.. 2 నెలల చిన్నారికి కరోనా, కొత్తగా ఎన్ని కేసులు అంటే..

2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 15 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో కోవిడ్ కలకలం.. 2 నెలల చిన్నారికి కరోనా, కొత్తగా ఎన్ని కేసులు అంటే..

2 Month Old Baby Tests Corona Positive

Updated On : December 22, 2023 / 9:35 PM IST

Coronavirus : దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. క్రమంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా పసికందులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

తెలంగాణలో మరో చిన్నారి కరోనా బారిన పడింది. హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో మరో పసికందుకి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 2 నెలల చిన్నారికి కరోనా సోకింది. కాగా గత 2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 14 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అటు.. వెస్ట్ బెంగాల్ లో 6 నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కోల్ కతా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.

Also Read : సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలా? జస్ట్ బ్లాక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి చాలు

పశ్చిమ బెంగాల్ లో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 6 నెలల చిన్నారి కూడా ఉంది. పసికందు తల్లిదండ్రులు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ కు వచ్చారు. కరోనా బారిన పడ్డ ముగ్గురూ.. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఇవాళ దేశంలో 640 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 997కి చేరింది.

తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా ఎన్ని కేసులు అంటే..
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 9 కోవిడ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఒక్క హైదరాబాద్ లోనే 8 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,245 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇంకా 68 శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కి చేరింది.

కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం గుబులు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా విషయంలో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.

Also Read : కరోనా కల్లోలం.. 6 నెలల పసికందుకి కోవిడ్ పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ మహమ్మారి మరోసారి విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు తమకు వచ్చింది కరోనా కొత్త వేరియంటా? మామూలు జ్వరమా ? అనేది తెలియక గందరగోళానికి గురవుతున్నారు.