Montha Cyclone : తెలంగాణలోని ఈ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. కుండపోత వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Montha Cyclone : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Heavy Rains in Telangana
Montha Cyclone : మొంథా తుపాను మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏపీలో తీరం దాటిన తరువాత దిశమార్చుకొని తెలంగాణపై విరుచుకుపడింది. దీంతో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మొంథా తుపాను కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలవైపు వెళ్తుందని భావించారు. అందుకు భిన్నంగా బుధవారం ఉదయం తరువాత క్రమంగా దిశ మార్చుకుంది. ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదైంది. బుధవారం సాయంత్రానికి కొంత బలహీన పడిన తుపాను వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: Cyclone Montha: హనుమకొండలో వరద బీభత్సం.. ఇళ్లలోకి చేరిన నీరు.. సాయం కోసం బాధితుల వేడుకోలు..
బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 సెం.మీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో ఆకేరు వాగులోంచి భారీగా వరద నీరు చేరడంతో ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మున్నేరు పక్కనే ఉన్న కాలనీల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
ఇవాళ తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా.. అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు.. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలతో 16 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించారు.
