ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రివర్గంలో చోటు కల్పించాలని దానం పైరవీ
ఫిరాయింపు ఎపిసోడ్లో దానంపై వేటు పడుతుందా? లేక రిజైన్ చేస్తారా?
Danam Nagender
అధికార పార్టీలో చేరితే ఎదురే ఉండదనుకున్నారు. వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవచ్చు..అన్నీ కలిసివస్తే అమాత్య యోగం కూడా దక్కుతుందని కలలు కన్నారు. కట్ చేస్తే రెండేళ్లు కావొస్తోంది..కానీ ఆయన అనుకున్నది ఒక్కటి అయితే..జరుగుతున్నది మరొకటి. అసలేం ఏం జరుగుతుందో కూడా అర్ధం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారట ఆ ఎమ్మెల్యే. ఈ గందరగోళ పరిస్థితే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేను డైలమాలో పడేసిందన్న చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.? ఆయన కష్టం తీరేదెప్పుడు .?
రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనలో దానం నాగేందర్ .?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయమే వేరు. ఎక్కడ అధికారం ఉంటే ఆయన అక్కడుంటారనేది పొలిటికల్ సర్కిల్స్తో పాటు..పబ్లిక్ టాక్. ఆ చర్చకు తగ్గట్లే2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్..కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కారు పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ కూడా చేశారు దానం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలవ్వడంతో దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్గా రియాక్ట్ కావడంతో ఇప్పుడు స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. మిగతవారి సంగతి ఎలా ఉన్నా దానం నాదేంగర్పై మాత్రం కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న టాక్ వినిపిస్తోంది.
పార్టీ ఫిరాయింపు ఎపిసోడ్లో దానం నాగేందర్పై అనర్హత వేటు పడితే నిబంధనల ప్రకారం..ఇమిడీయేట్గా ఆయన మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. అందుకే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపే దానంతో రాజీనామా చేయిస్తారన్న చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో దానంలో టెన్షన్ మొదలైందట. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడానికి రెడీ అంటూ ఆయనే స్వయంగా లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెడుతున్నట్టు ప్రచారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయడానికి రెడీ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అందుకు అనుగుణంగా తనదైన స్టైల్లో ఢిల్లీ లెవల్లో ప్రయత్నాలు చేశారు దానం. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం పెద్దల దగ్గర పైరవీ చేసినా అక్కడ పెద్దగా సానుకూల స్పందన రాలేదట. దీంతో తన చేత రాజీనామా చేయిస్తారా, లేదంటే అనర్హత వేటు పడుతుందా అర్ధం కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారట దానం నాగేందర్.
కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తాను ఏదనుకుంటే అది చేయవచ్చని ఎంతో ఆశపడ్డ దానం నాగేందర్కు..హస్తం గూటికి చేరాక ఆగమాగం జగన్నాధం అన్నట్లు ఉందట పరిస్థితి. అధికార కాంగ్రెస్లో చేరి అధికారం చెలాయిద్దాం, అనుకున్నవన్నీ చేసేసుకుందాం, మంత్రి అయిపోదాం అనుకుంటే..ఆఖరికి ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయేలా ఉందే అని తెగ ఫీలైపోతున్నారట దానం. ప్రస్తుత పరిణామాలన్నింటినీ పరిశీలించాక ఆయన బాగా ఢీలా పడిపోయారన్న టాక్ వినిపిస్తోంది. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన దానం..ఏదీ వర్కౌట్ కాలేదని.. ఇప్పుడు సైలెంట్గా పార్టీ ఏం చెప్తే అది చేస్తానని..అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొస్తున్నారట.
అంతే కాదు రాజీనామా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పేశారు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్నట్లు కాదని..తానేదో అనుకుని బీఆర్ఎస్ను వదిలి హస్తం పార్టీలో చేరితే ఇక్కడ అంతా రివర్స్లో ఉందని వాపోతున్నారట దానం. పైగా అనర్హత విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, తర్వాత తన పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాను ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో..పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ పరిస్థితి అయిపోయిందని మధన పడుతున్నారట. ఫిరాయింపు ఎపిసోడ్లో దానంపై వేటు పడుతుందా లేక రిజైన్ చేస్తారా అనేది చూడాలి మరి.
