Rajnath Singh Meets Prabhas : ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కృష్ణంరాజు మృతికి సంతాపం

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు ఇంటికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు.

Rajnath Singh Meets Prabhas : ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కృష్ణంరాజు మృతికి సంతాపం

Updated On : September 16, 2022 / 5:01 PM IST

Rajnath Singh Meets Prabhas : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు ఇంటికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, పిల్లలను ఆయన ఓదార్చారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే హీరో ప్రభాస్ ను కలిసి తన సంతాపం తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు నివాసంలో ఉన్నారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

కృష్ణంరాజు చివరి వరకు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగానూ ఉన్నారు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌.. `బాహుబలి` చిత్రంతో జాతీయ స్థాయిలో నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం `ఆదిపురుష్‌`లో రాముడిగా నటిస్తున్నాడు ప్రభాస్‌. అదే సమయంలో ఢిల్లీ రామ్‌ లీలా మైదానంలో నిర్వహించే దసరా వేడుకలకు ప్రభాస్‌ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం విశేషం.

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు సోమవారం ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. బీజేపీ హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. బీజేపీ నాయకులతో కృష్ణంరాజుకు మంచి సంబంధాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎంపీగా గెలిచారు.

తన పెదనాన్న కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఖంలో ఉన్నాడు. దీంతో అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్ ను కలిసి పరామర్శించారు. ప్రభాస్ కుటుంబాన్ని ఓదార్చారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ప్రముఖ దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఇలా వరుసగా సెలబ్రిటీలంతా… ప్రభాస్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.