అందుకే రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.. కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఇస్తాం: తెలంగాణ డీజీపీ
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ రియాజ్ దాడికి తెగబడే ప్రయత్నం చేసినట్లు డీజీపీ తెలిపారు.

Riaz Encounter: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ రియాజ్ దాడికి తెగబడే ప్రయత్నం చేసినట్లు డీజీపీ తెలిపారు. రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై దాడికి తెగబడ్డాడని శివధర్ రెడ్డి అన్నారు. (Riaz Encounter)
రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారని, వారి దగ్గరున్న వెపన్‌ను లాక్కున్న రియాజ్ కాల్పులకి ప్రయత్నించాడని అన్నారు. దీంతో పోలీసులు ఎదురుకార్పులు చేశారని అన్నారు. పోలీసు జరిపిన ఎదురుకాల్పులో రియాజ్ చనిపోయాడని డీజీపీ నిర్ధారించారు.
నిన్న రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్‌పై కూడా రియాజ్ దాడి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ మరొక కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించాడని అన్నారు. దీంతో అతడిపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
కాగా, నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో తప్పించుకు తిరిగిన రియాజ్ నిన్న సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులకు దొరికాడు. ఆ తర్వాత అక్కడ కానిస్టేబుల్ ఆసీఫ్‌ను రియాజ్ గాయపర్చాడు. రియాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అసుపత్రికి తరలించగా, ఇవాళ ఉదయం అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి
కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీస్‌శాఖ తరపున నివాళులు అర్పిస్తున్నామని డీజీపీ అన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎలాంటి నేరస్తులనైనా అణచివేస్తామని తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ పదవీ విరమణ వరకు వచ్చే శాలరీని కూడా ఆయన కుటుంబానికి అందిస్తామని అన్నారు. 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని తెలిపారు.
పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షలు ఇస్తామని డీజీపీ తెలిపారు. రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని అన్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అని చెప్పారు.