DMK Support Congress in TS Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన డీఎంకే

కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి

DMK Support Congress in TS Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన డీఎంకే

తమిళనాడులోని అధికార పార్టీ అయిన డీఎంకే మంగళవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంగళవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో పోటీకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పని చేయాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, తమకు మద్దతు ప్రకటించినందుకు తమిళనాడు సీఎం స్టాలిన్‭కు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది.

నిజానికి కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళనాడు బయట కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డీఎంకే సహకరించడం ఇదే మొదటిసారి.

ఇకపోతే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్ఆర్టీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఏకంగా ఎన్నికల రంగం నుంచి తప్పుకొని మరీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఒక బలమైన కారణం కోసం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని గద్దె దింపడం కోసం మేం ఈసారి ఎన్నికల పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ తాతకు ఓటేస్తానంటూ మారాం చేసిన చిన్నారి.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. 119 అసెంబ్లీ స్థానాలకు గాను జరగనున్న ఈ ఎన్నికల పోటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం కూడా తమ ప్రభావం చూపించుకునే పనిలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల