MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఘోరం.. ఒక బ్లడ్ గ్రూప్‌నకు బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించిన డాక్టర్లు..
ఇప్పటికే ఎంజీఎంలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాజా ఘటనతో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి రక్తహీనతతో బాధపడుతోంది. ఈ నెల 16 ఎంజీఎం ఆసుపత్రిలో చేరింది. ఆమె డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్లడ్ అవసరం ఏర్పడింది. ఆమెకు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. ఈ నెల 17, 18 తేదీలలో ఆమెకు ఓ పాజిటివ్ బ్లడ్ కి బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. 19వ తేదీన రక్తనమూనాలను పరిశీలించారు. దాంతో నిర్లక్ష్యం బయటపడింది.
ఒక బ్లడ్ గ్రూప్ నకు బదులుగా మరో బ్లడ్ గ్రూప్ ను ఎక్కించడం వల్ల ఆమెకి పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంది. అయితే, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఎంజీఎంలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాజా ఘటనతో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.