KCR: కేసీఆర్ ఆ పేరు పలకొద్దని అనుకుంటున్నారా..?
ఇప్పుడే కాదు గత ఏడాదిన్నర కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోను కేసీఆర్ ఎక్కడా ఆ పేరును పలకలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

BRS అధినేత కేసీఆర్ ఆయన పేరును ఉచ్చరించేందుకు ఇష్టపడటం లేదా? అసలు ఆయన పేరును పలుకకూడదని గూలాబీ బాస్ డిసైడ్ అయ్యారా? ఎస్..BRS సిల్వర్ జూబ్లీ సభను చూస్తే అవుననే సమాధానం వస్తోందట. ఎల్కతుర్తి బహిరంగ సభలో గంటపాటు ప్రసంగించిన కేసీఆర్..ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే కాదు మళ్లీ BRS అధికారంలోకి వచ్చే వరకు కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కారు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
BRS పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకొని..25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించింది పార్టీ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు 53 నిమిషాల పాటు ప్రసంగించారు. TRS పార్టీ ఎలా ఏర్పాటైందన్న దాంతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్ర సాధన, పదేళ్ల BRS పరిపాలన గురించి కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్..అటు బీజేపీపై కూడా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన BRS అధినేత కేసీఆర్..ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని..ప్రభుత్వంలో ఉన్న నాయకులు..నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్న కాంగ్రెస్ పాలకులు మంచిగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ శాసనసభకు ఎందుకు రారని ప్రశ్నించేవారికి చెబుతున్నానంటూ.. అసెంబ్లీలో తమ పార్టీ నాయకులు ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే దిక్కులేదని…అలాంటప్పుడు వాళ్లకు నేనెందుకంటూ సీఎం రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
Also Read: ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చు, అణ్వాయుధాలు ఉపయోగిస్తామంటూ వార్నింగ్..!
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అంశాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్..ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎత్తలేదు. కనీసం ముఖ్యమంత్రి అనిగాని, సీఎం అనిగాని ప్రస్థావించలేదు. ఒకటి రెండు సందర్భాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరును ప్రస్తావించకుండానే ఆర్థిక మంత్రి అని మాట్లాడారు. కేసీఆర్ సుధీర్ఘ ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇప్పుడే కాదు.. అన్ని సందర్భాల్లోనూ..
ఎందుకంటే కేసీఆర్ పై సందర్బం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు కేసీఆర్ గురించి, వారి కుటుంబం గురించి సీఎం రేవంత్ వ్యక్తిగతంగాను టార్గెట్ చేసి మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో ఎల్కతుర్తి బహిరంగ సభలో కచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడతారని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ పేరును కూడా పలకకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఇప్పుడే కాదు గత ఏడాదిన్నర కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోను కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును పలకలేదని ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి పేరును గులాబీ బాస్ కేసీఆర్ పలకకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పుడు తనపై, తన కుటుంబంపై రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు, విమర్శలకు దీటుగా సమాధానం చెబుతారని తెలంగాణ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగంలో పస లేదంటూ సీయం రేవంత్ కొట్టిపడేశారు. యావత్తు తెలంగాణా కేసీఆర్ అంటూ సంబోధిస్తుంటే..సీఎం రేవంత్ మాత్రం చంద్రశేఖర్ రావు అని కొన్ని సందర్భాల్లో మరికొన్ని సందర్భాల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే అంటుంటారు. ఇలా కేసీఆర్ అన్న పదాన్ని రేవంత్ ఉచ్చరించకపోవడం…ఇప్పుడు రేవంత్ పేరును కేసీఆర్ పక్కన పెట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.