చేప ప్రసాదానికి ఎవ్వరూ రావద్దు.. ఈ ఏడాది రద్దు

  • Published By: dharani ,Published On : June 8, 2020 / 07:03 AM IST
చేప ప్రసాదానికి ఎవ్వరూ రావద్దు.. ఈ ఏడాది రద్దు

Updated On : June 8, 2020 / 7:03 AM IST

ఆస్తమాతో భాదపడేవారంతా ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. కరోనా పున్యమానా ఈసారి  చేప ప్రసాదం అందించడంలేదు. 175 ఏళ్ల నుంచి వస్తున్న ఈ చేప ప్రసాదం కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. ప్రతీ సంవత్సరం ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 8.30 గంటల నుంచి తరవాతి రోజు ఉదయం 8 గంటల వరకు చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని ఈసారి నిలిపివేస్తున్నట్లు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

హరినాథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను కొద్దిరోజుల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రస్తుతం బయట వైరస్‌ విజృంభిస్తుంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేప ప్రసాదం పంపిణీ సరైంది కాదని భావించి… ఈ కార్యాక్రమాన్ని రద్దు చేశామన్నారు. ఈ కార్యక్రమం కనుక చేపడితే.. వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాలతో చేప ప్రసాదం అందించడం కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

ప్రతీ సంవత్సరం ఇలా చేసేవారు..
చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసి చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. ఆ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు. 

2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది.  మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అప్పటినుంచి పోయిన ఏడాది వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగింది. కరోనా వైరస్‌ కారణంగా ఈసారి పంపిణీకి బ్రేక్‌ పడింది.

Read: మృగశిర కార్తె : చేపలు ఎందుకు తింటారో తెలుసా