రూ.100 కోట్లు ఆప్ నేతలకు చేర్చడంలో కవిత కీలకం- ఈడీ సంచలనం
మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం.

ED On Mlc Kavitha Role
MLC Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, పాత్రపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ”లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేశాం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రూ.100 కోట్లు ఆప్ నాయకులకు చేర్చడం కవిత కీలకం.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలో తనిఖీలు నిర్వహించాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం. 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధింపు. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశాము. సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారు” అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది ఈడీ.
కవిత అరెస్ట్ పై ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కీలక విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో కవిత కుట్రదారుగా, లబ్దిదారుగా ఉన్నారని ఈడీ చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు అందించారని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. మార్చి 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు చేశాం, ఆ సందర్భంగా కవితను అరెస్ట్ చేశామని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులోనూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కొందరు ఉన్నతాధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. 2021-22 లిక్కర్ పాలసీ ద్వారా హోల్ సేల్ వ్యాపారుల నుంచి కిట్ బ్యాగ్స్ తీసుకునే విధంగా, లాభాలు పొందే విధంగా ఇందులో కవిత పాత్ర ఉందని ఈడీ ప్రకటనలో తెలిపింది.
నిలకడగా కవిత ఆరోగ్యం
ఈడీ కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని.. బీపీ సాధారణంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈడీ కస్టడీలో కవితకు ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ కస్టడీలో కవితకు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు.
Also Read : ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!