Educational Institutions : సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం..!

కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.

Educational Institutions : సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం..!

Educational Institutions

Updated On : August 12, 2021 / 7:12 PM IST

Educational Institutions : కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ప్రత్యక్ష తరగతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఈ ప్రశ్నలకు సెప్టెంబర్ 1 అనే సమాధానం వినిపిస్తోంది. అవును రాష్ట్రంలో విద్యాసంస్థలు సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. తొలుత 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్‌ అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. రెండో వేవ్‌కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో మూసేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. మళ్లీ విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. మళ్లీ కోవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు వస్తున్న తరుణంలో విద్యా సంస్థలు తెరవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడిపోయాయి. దీంతో చదువులన్నీ అటకెక్కాయి. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా చాలామంది చిన్నారులు, విద్యార్థులకు అవి బుర్రకెక్కడం లేదు. దానికి తోడు పరీక్షల్లేకుండానే టెన్త్, ఇంటర్ విద్యార్థులను బోర్డులు పాస్ చేసేశాయి. అయితే, ఇక బడులు తెరవాల్సిందేనని ‘విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడల పార్లమెంటరీ పానెల్’ తేల్చి చెబుతోంది. భౌతిక తరగతులను నిర్వహించకుండా బడులను ఇంకా మూసి ఉంచితేనే మరింత ప్రమాదమని అభిప్రాయపడింది. వినయ్ పి. సహస్రబుద్ధ నేతృత్వంలోని పానెల్.. దానికి సంబంధించిన నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది.

బడులను తెరిస్తే విద్యార్థులకే మంచిదని తేల్చింది. స్కూళ్లు మూసేయడం వల్ల చాలా కుటుంబాలపై సామాజికంగా దెబ్బపడిందని, పిల్లలు ఇంటి పనులు చేస్తున్నారని చెప్పింది. ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉండడం, ఆన్ లైన్ క్లాసులు వింటుండడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. నాలుగు గోడల మధ్య బందీ కావడంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.