Telangana Govt : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఈసారి బీసీలకు 42శాతం సీట్లు..!

Telangana Govt : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీలకు 42శాతం ..

Telangana Govt : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఈసారి బీసీలకు 42శాతం సీట్లు..!

Telangana Govt

Updated On : December 18, 2025 / 8:19 AM IST

Telangana Govt : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. చివరి విడత పోలింగ్ బుధవారం పూర్తయింది. అయితే, పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన సర్పంచ్ లు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. అయితే, ఇదే ఊపులో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలనుసైతం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also Read: Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌షాక్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నారా.. అలా అస్సలు చేయొద్దు..

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జడ్పీటీసీ) ఎన్నికలను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ భావిస్తుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి చెప్పిందని సమాచారం. దీంతో ఈ నెలాఖరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు.. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. అన్నీ అనుకూలిస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంలోని ముఖ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని పల్లె ప్రజలు అధికార పార్టీ వైపే ఉన్నారని నిరూపించింది. ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి పట్టణ ప్రాంత ప్రజలుసైతం కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉన్నారని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించరాదని, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించుకోవచ్చునని కోర్టులు స్పష్టం చేశాయి. దీంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లుపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపివేశాయి. మరోవైపు.. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది. అయితే, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మున్సిపల్, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే తొలుత మున్సిపల్, ఆ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.