KCR : తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమే- కేసీఆర్
అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం.

KCR : బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమే అని ఆయన అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ అన్నారు. ప్రజా సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని హితవు పలికారు కేసీఆర్.
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు ఒక్కరోజే అసెంబ్లీ ఉంటుందని సమాచారం. ఆ తర్వాత 16వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ రేపు రాబోతోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానిపై కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం జరిగింది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.
అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. రైతుబంధు ఎందుకు తీసుకొచ్చారు? రైతు భరోసా ఎందుకు రావడం లేదు? అనే అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్.
Also Read : తెలంగాణ తల్లి రూపంపై అనవసర రాద్ధాంతం వద్దు- శిల్పి రమణారెడ్డి