మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలని హితవు పలికారాయన.

KCR : కాంగ్రెస్ సర్కార్ ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి కానీ రౌడీ పంచాయితీ చేయడానికి కాదంటూ ఘాటుగా స్పందించారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదన్నారు. ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా? అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్.
అరెస్ట్ లకు భయపడేది లేదన్న కేసీఆర్.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రౌడీ పంచాయితీలు చేయడం మాకు కూడా తెలుసు, మాకు కూడా తిట్టడం వచ్చు, తిట్టడం మొదలు పెడితే రేపటిదాకా తిడతా అని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు కేసీఆర్. ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలని హితవు పలికారాయన.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు. ఇవాళ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది చేరికల సందర్భంగా రేవంత్ సర్కార్ పై ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్. రాబోయే రోజుల్లో కచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ పూర్తిగా తప్పు పట్టారు.
ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం మంచిది కాదన్న సూచన చేయడం జరిగింది. ప్రజలకు మంచి చేసేందుకు, సేవ చేసేందుకు, పాలన అందించేందుకు.. ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని.. కానీ, కక్ష సాధింపు చర్యలకు ఎన్నుకోరు అనే స్పష్టమైన అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసింది, ప్రస్తుతం ప్రజలు.. ఈ 11 నెలల్లోనే ఏం కోల్పోయారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనే అంశాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కాకుండా.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలు కేవలం 10శాతం అయితే.. ఎలాంటి హామీలు ఇవ్వకుండానే దాదాపు 90శాతం హామీలను అమలు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
Also Read : ఆ అధికారులు, బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో అరెస్ట్ టెన్షన్!