బీజేపీకి మద్దతు ఉంటుంది, ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు- హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ లా తాము ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదని విమర్శించారు హరీశ్ రావు.

Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణకు మంచి జరుగుతుంది అంటే బీజేపీకి మద్దతు ఉంటుందన్నారు. అంశాల వారీగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే, రాజకీయంగా మాత్రం తాము న్యూట్రల్ గానే ఉంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం అనేది పార్టీ నిర్ణయం అని తెలిపారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు.
ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ లా తాము ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదని విమర్శించారు హరీశ్ రావు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ హరీశ్ రావు చిట్ చాట్ లో అన్నారు.
తెలంగాణకు మంచి జరుగుతుంది అంటే బీజేపీకి మా మద్దతు ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అటు బీజేపీలో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. హరీశ్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటేనే.. మేము ఏంటి? మా విలువ ఏంటి? అనేది ప్రజలకు తెలుస్తుందని హరీశ్ రావు అన్నారు. ఏపీలో చంద్రబాబు పనైపోయిందని అంతా అనుకున్నారు, అందుకు భిన్నంగా చంద్రబాబు సీఎం అయ్యారు.. అలానే, తెలంగాణలో కేసీఆర్ పనైపోయిందని అంతా అనుకుంటున్నా.. భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏడు నెలల వ్యవధిలోనే వ్యతిరేకత మొదలైందన్నారు. ఇక, బీఆర్ఎస్ పేరు మార్పు వార్తలపైనా హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవాలి. పార్టీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం మేరకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని ఆయన తేల్చి చెప్పారు. అంటే, ఇకపై బీఆర్ఎస్ గానే ఉంటుందని, అందులో మార్పు ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
గతంలో మేము ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వారిని పార్టీలో చేర్చుకోలేదు, వాళ్లే మా దగ్గరికి వచ్చారు, బీఆర్ఎస్ లో చేరారు అని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన మాకు, పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు హరీశ్ రావు.
Also Read : ఓటరుతో పాటు క్యాడర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా..