Harish Rao : హరీశ్ రావు కీలక నిర్ణయం.. పాదయాత్రకు ప్లాన్.. ఎందుకీ పాదయాత్ర, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు..

స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరింత ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ లోనే చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.

Harish Rao : హరీశ్ రావు కీలక నిర్ణయం.. పాదయాత్రకు ప్లాన్.. ఎందుకీ పాదయాత్ర, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు..

Updated On : February 16, 2025 / 8:53 PM IST

Harish Rao : ప్రజా సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పై పోరుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలే అస్త్రాలుగా పాదయాత్రకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు మెదక్ జిల్లా నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పోరుబాట పట్టబోతున్నారు.

బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, కవిత ఇప్పటికే రైతు దీక్షలు, జిల్లాల పర్యటనలతో దూకుడు పెంచుతుండగా తాజాగా పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం వంటి పథకాల అమల్లో సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల అంశం అజెండాగా హరీశ్ రావు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీకారం చుట్టిన సంగమేశ్వ-బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్ తో హరీశ్ రావు పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

Also Read : ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయో తెలుసా? అప్పట్లో ఎండలు మండిపోయినదానికంటే దారుణం

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పై ఏ మాత్రం దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేత. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్రపై చర్చించారు హరీశ్ రావు.

సంగమేశ్వర-బసవేశ్వర సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందే నారాయణ్ ఖేడ్, ఆంధోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలను కలిపేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత పాదయాత్రను మొదలు పెట్టే ఆలోచనతో ఉన్న హరీశ్ రావు.. షెడ్యూల్, రూట్ మ్యాప్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరింత ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ లోనే పాదయాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దీంతో సరైన ముహూర్తం ఖరారు చేయడంపై గులాబీ నేతలు కసరత్తు చేస్తున్నారు.