Harish Rao: ప్రజాభవన్ సాక్షిగా దుష్ప్రచారం చేశారు, అవాస్తవాలు చెప్పారు- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.

Harish Rao: ప్రజాభవన్ సాక్షిగా దుష్ప్రచారం చేశారు, అవాస్తవాలు చెప్పారు- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

Updated On : July 10, 2025 / 1:08 AM IST

Harish Rao: తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా నదీ జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. క్లబ్బులు, పబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. సీఎం రేవంత్ సవాల్ పై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై ఆయన నిప్పులు చెరిగారు.

ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని హరీశ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని అన్నారు. కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు. చర్చకు పిలిచే దమ్ములేకనే ప్రజా భవన్ లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు. శాసనసభ, శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు హరీశ్ రావు.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావడానికి నేను రెడీ- సీఎం రేవంత్ రెడ్డి.
కాగా, కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి లేదా నేనే మీ ఫామ్ హౌస్ కి వస్తాను అని అన్నారు. ”మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. నిపుణుల ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దాం. మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పుడు స్పీకర్ కు లేఖ రాసినా మేం సిద్ధం.

మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. ఎలాంటి గందరగోళం లేకుండా.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి. నిపుణులను పిలుద్దాం. స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాం. అర్ధవంతమైన చర్చ పెడదాం.

మీ ఆరోగ్యం సహకరించకపోతే.. తారీఖు చెప్పండి.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేను మంత్రుల బృందాన్ని పంపుతా.. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం. కాదు కూడదు నేను కూడా రావాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేను కూడా సిద్ధం. వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడతాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.