Harish Rao Thanneeru : కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందువులు, ముస్లింల ఆస్తులకు ఇబ్బందులు ఉండవు- హరీశ్ రావు

దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.

Harish Rao Thanneeru : కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందువులు, ముస్లింల ఆస్తులకు ఇబ్బందులు ఉండవు- హరీశ్ రావు

Harish Rao Thanneeru : సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనపడుతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని దింపేస్తారన్న భయం వెంటాడుతోందన్నారు. ఆరు గ్యారెంటీల గురించి, పాలన గురించి రేవంత్ మాట్లాడటం లేదన్నారు హరీశ్ రావు. అయితే తిట్టు.. లేదంటే ఒట్టు.. ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని అని విమర్శించారు.

”దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారు. రేవంత్ కి అయితే అతి తెలివి, లేదంటే మతిమరుపు. రిజర్వేషన్లు పెంచమని మేము అంటే రిజర్వేషన్లు తీసేసేందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని అబద్దాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లింల ఆస్తులకు ఇబ్బందులు ఉండవు. రేవంత్ వచ్చాక ధరలపై అదుపు లేకుండా పోయింది. పప్పు, నూనె, సిమెంట్.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. అటు కేంద్రంలో బీజేపీ అలానే ఉంది, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ లోనూ అలానే ఉంది.

బీసీలపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. బీసీలకి అత్యధిక టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. బీసీలకి అన్యాయం చేస్తోంది రేవంత్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్ లోనూ బీజేపీకి రేవంత్ సపోర్ట్ చేస్తున్నారు. డమ్మీ అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలవాలన్న రేవంత్ ఆలోచన కరీంనగర్ ప్రజలు తెలుసుకున్నారు” అని ధ్వజమెత్తారు హరీశ్ రావు.

ఈటలదే విజయం అన్న మల్లారెడ్డి కామెంట్స్‌పై స్పందించిన హరీశ్ రావు..
మల్లారెడ్డి కామెంట్స్ పై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. ఆయన సందర్భోచితంగా మాట్లాడారనే అనుకుంటున్నాం. పరిశీలిన తరువాత చర్యలుంటాయి. బడే భాయ్ అంటూ మోడీని రేవంత్ రెడ్డి పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? బండి సంజయ్.. రేవంత్ రెడ్డిని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు హరీశ్ రావు.

Also Read : రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?