KTR : దమ్ముంటే.. ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి- సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్
లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.

KTR
KTR : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. క్యాబినెట్ లో గంటన్నర సేపు చర్చ జరిగినట్లు కథనాలు వచ్చాయని, సీఎం కార్యాలయం నుంచి రోజుకో లీకులు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై నాలుగు గోడల మధ్య కన్నా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగిందని కేటీఆర్ తెలిపారు. చెల్లింపులు కూడా అవకతవకలు లేకుండానే జరిగాయని ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. అయినప్పటికి, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదని ధ్వజమెత్తారు కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ ను కలిసి అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని హరీశ్ రావు అన్నారు. ప్రజలకు తాము జవాబుదారీ అని చెప్పిన హరీశ్ రావు.. సభలో చర్చ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ ఫార్ములా కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా లీకులు ఇస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. లీకులు ఇచ్చేకంటే 4 కోట్ల ప్రజల ముందు అసెంబ్లీలో చర్చ పెడితే తాము వాస్తవాలేంటో చెబుతామంటున్నారు. కార్ రేసింగ్ లో తాము ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదని.. అన్నీ అధికారికంగానే జరిగాయని, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ను కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు వినతిపత్రం సమర్పించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు. హైదరాబాద్ లో తాము నిర్వహించిన ఈ కార్ రేసింగ్ తో రాష్ట్రానికి దాదాపు 700 కోట్ల రూపాయల మేరకు లబ్ది జరిగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్.. అనాలోచితంగా ఈ కార్ రేస్ నిర్వహణను రద్దు చేసుకోవడంతో రాష్ట్ర సర్కార్ కు నష్టం జరిగిందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ తన లేఖలో వ్యక్తం చేశారు.
Also Read : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైకి బుల్డోజర్..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?