KTR Tea Stall : ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నాం, ఎవరినీ వదలం- సిరిసిల్ల టీ స్టాల్ ఘటనపై కేటీఆర్ వార్నింగ్
కేటీఆర్ ఫోటో తీయాలని చెప్పినా తాను తీయలేదని, అందుకే తన షాపు మూసివేయించారని బాధితుడు ఆరోపించాడు.

KTR Tea Stall : సిరిసిల్లలో చిరువ్యాపారి శ్రీనివాస్ టీ స్టాల్ ను మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నామని, ఎవరినీ వదిలేది లేదని ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. బతుకమ్మ ఘాట్ సమీపంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ ఫోటోతో టీ స్టాల్ నడుపుతున్నాడు. తన టీ షాప్ పై కేటీఆర్ ఫోటోను చూసి కలెక్టర్ సహించలేక షాపు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు వాపోయాడు.
కేటీఆర్ ఫోటో తీయాలని చెప్పినా తాను తీయలేదని, అందుకే తన షాపు మూసివేయించారని బాధితుడు ఆరోపించాడు. అయితే, ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతోనే టీ స్టాల్ ను తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. టీ స్టాల్ పోయినా సరే కేటీఆర్ ఫోటో తీసేది లేదని తేల్చి చెప్పడంతోనే.. తన టీ స్టాల్ మూసివేయించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : గుడ్‌న్యూస్.. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు.. 120 దేశాల నుంచి అందమైన అమ్మాయిలు.. పూర్తి వివరాలు..
ట్రేడ్ లైసెన్స్ లేకుండా టీ స్టాల్ నిర్వహించడాన్ని తప్పు పడుతూ షాపు మూసివేతకు కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్ టీ స్టాల్ ముందు బైఠాయించారు. షాపు మూసి వేసే దాకా వారు అక్కడే ఉన్నారు. కాగా, టీ స్టాల్ మూసివేత వ్యవహారంలో అధికారులు అతిగా వ్యవహించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఒకవైపు పార్టీ రజతోత్సవ సంబరాలు చేస్తూనే మరోవైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ముందుండి అలుపెరుగని పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారని అన్నారు. దాంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నామన్నారు. ఏప్రిల్ రెండో వారంలో పార్టీ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో ఉంటుందన్నారు. తేదీ, వేదిక మళ్లీ ప్రకటిస్తామన్నారు.
మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఏప్రిల్ 27న ఒక బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్థలం, ఏ జిల్లాలో అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. రజతోత్సవ సంవత్సరంలో 12 నెలల పాటు వివిధ వర్గాలతో మమేకం అయ్యేలా వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయన్నారు కేటీఆర్.