సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు

గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు

Fire Accident

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎస్‌బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో ఆ పరిశ్రమ డైరెక్టర్, మరో ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

పరిశ్రమలోని మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉండడంతో దాని పరిసరాల నుంచి అధికారులు ప్రజలను ఖాళీ చేయించి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఆ పరిశ్రమ వద్ద అధికారులు, పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు.

మృతులు: రవి శర్మ (కంపెనీ డైరెక్టర్), సుబ్రహ్మణ్యం (ప్రొడక్షన్ ఇన్‌చార్జ్), దయానంద్ (ప్రొడక్షన్ ఇన్‌చార్జ్), సురేశ్ పాల్ (మెయింటెనెన్స్ ఇన్‌చార్జ్), ఇంకా ఇద్దరి పేరు తెలియాల్సి ఉంది.

మంటలు అందుపులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలంలో ఉండి మంటలు ఆర్పించారని చెప్పారు. 25-30 మందిని ఎమ్మెన్నార్/ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని చెప్పారు.

అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read : పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి.. చంద్రబాబే కారణం అనడంతో ఉద్రిక్తత