నిండుకుండలా జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. బ్రిడ్జీలపై నుంచి వరద ప్రవాహం పోతుండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీటిలో మునిగాయి. వరంగల్ నగరం పూర్తిగా జలమయమైంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ ప్రస్తుత నీటిమట్టం 46 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాలిపేరు మొత్తం 24 గేట్లను ఎత్తి దిగువకు లక్ష క్యూసెక్కులను నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిగూడెం దగ్గర రాళ్లవాగు కల్వర్టు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మల్లన్నవాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చడంతో వంతెన నిర్మాణ పనులు చేస్తున్న ట్యాంకర్, సెంట్రింగ్ సెట్టర్లు, రైతుల మోటార్లు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ మండలాల్లో చెరువులు అలుగులు పడి వరినాట్లు కొట్టుకుపోయాయి.
ఖమ్మం జిల్లా చెర్ల మండలం తాలిపేరు జలాశయం వరద పోటెత్తుతున్నది. దీంతో 23 గేట్లను ఎత్తి 1.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు రావడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ మత్తడి దుంకుతోంది. వానలకు తోడు నాగార్జున సాగర్ ఎడమకాలువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
మూడేళ్ల తర్వాత మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో మంత్రి పువ్వాజ అజయ్‌కుమార్ పరిశీలించి, అధికారులను అప్రమత్తం చేశారు.
వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. మేడారం జంపన్న వాగు పొంగి పొర్లుతోంది. వర్షం నీటిలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు మునిపోయాయి. కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తుండటంతో ములుగు వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
రామప్ప చెరువు నీటిమట్టం 34 పీట్లకు చేరింది. మత్తడి పోస్తుంది. వరంగల్ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. అక్కడి ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలో పలు కాలనీలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగపేట మండలంలో రెండు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు .కన్నాయిగూడెం మండలంలో కొత్తూరు గ్రామానికి చెందిన 200 మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు .
రామన్నగూడెం వద్ద 9.84 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. అధికారులు మొదటి ప్రమాద సూచిక హెచ్చరికను జారీ చేశారు. ఏటూరు నాగారం కేంద్రంగా జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ, జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే, ఎటునాగారం నుంచి వరద తీవ్రత అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర, భీమా ప్రాజెక్టులకు వరద పోటు ఎక్కువైంది. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారగా, ప్రస్తుతం 1,36,595 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టులో ప్రస్తుతం 1,043 అడుగుల నీరు నిల్వ ఉండగా, పూరిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.532 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి దిగువకు 1,37,509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 566 అడుగుల వద్ద నీరు ఉంది. ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,51,104 క్యూసెక్కుల నీరు చేరుతుంది.
దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 868.40 అడుగుల వద్ద నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలో 31 మండలాలకుగాను కేతెపల్లిలో అత్యధికంగా 48.6 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా అడవిదేవులపల్లిలో 5.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
నల్గోండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 42,378 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 556.70 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం సాగర్‌లో 248.29 టీఎంసీల నీరు ఉండగా, పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. ప్రాజెక్టుకు 42,378 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 4,107 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి నీరు భారీగా చేరుతుంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్‌ఎండీ రిజర్వాయర్ శనివారం సాయంత్రం వరకు 12 టీఎంసీలకు చేరుకుంది. జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి నది 10.8 ఫీట్ల వరద ఉధృతి తో ప్రవహిస్తుంది. అధికారులు కాళేశ్వరం బ్యారేజ్ 65 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలారోజుల తర్వాత మానేరు నది ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరొస్తోంది. ప్రాజెక్టు లెవల్ 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 145.79 మీటర్ల నీరుంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.40 టీఎంసీల నీరుంది.