Bhadrachalam: భద్రాద్రి రాములోరి కల్యాణం తిలకించేందుకు ఉచిత టికెట్లు.. కేవలం వారికి మాత్రమే
ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణంను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Bhadrachalam Temple
Bhadrachalam Rama Temple: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. రాములోరి కల్యాణం, లోక కల్యాణంగా భావిస్తారు. ప్రతీయేటా భద్రాచలం దేవస్థానంలోని మిథిలా స్టేడియంలో జరిగే ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ క్రమంలో స్వామివారి కల్యాణం వీక్షించేందుకు టికెట్లకోసం భక్తులు పోటీ పడుతుంటారు. అయితే, ఈసారి దాతలకు ఉచితంగా రాములోరి కల్యాణం టికెట్లు ఇవ్వనున్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణంను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి రూ.50లక్షలకుపైగా విరాళాలు ఇచ్చిన భక్తులకు శ్రీరామనవమి సందర్భంగా (ఏప్రిల్ 6న) మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణంలో పాల్గొనేందుకు ఉచితంగా రెండు టిక్కెట్లు ఇస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వారికోసం ప్రత్యేకంగా ఒక సెక్టార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మార్చి 26లోపు రూ.50లక్షలకుపైగా విరాళాలు ఇచ్చిన భక్తులు దేవస్థానంలో లేఖను అందజేయాలని ఈవో సూచించారు.
ఏప్రిల్ 6న రాములోరి కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ వరకు దేవస్థానం తరపున కాటేజీలు, గదులు ఇవ్వలేమని, బుకింగ్ ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో కోరారు. ఇదిలాఉంటే.. తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వరరావు సీతారాముల కల్యాణానికి రూ.13వేల విలువైన 500 గ్రాముల ముత్యాల తలంబ్రాలను ఈవోకు అందజేశారు.