బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్.. సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

GHMC Deputy Mayor Mothe Srilatha Shoban Reddy
Telangana Congress Party : గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, రెండు రోజుల్లో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఉద్యమ కారులను కేసీఆర్, కేటీఆర్ అవమానిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు డిప్యూటీ మేయర్ గైర్హాజరయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇప్పటికే పార్టీలో చేరికపై రేవంత్ తో వారు చర్చలు జరిపినట్లు సమాచారం. రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఉన్నారు.
Also Read : హరీశ్ రావుకి దేవాదాయశాఖ ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వారం రోజుల్లో బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. వీరికితోడు మరికొందరు గ్రేటర్ లోని బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది.