GHMC: మిషన్ అరుస్తుందిక్కడ.. రోడ్డుపై చెత్త వేశారనుకో.. మీ పని గోవిందా..
మనం రోడ్లపై చెత్త వేసిన ప్రతిసారి మిషన్ అరిస్తే ఎలా ఉంటుంది?

నాగార్జున హీరోగా ఆ మధ్య వచ్చిన సూపర్ సినిమాలో బ్రహ్మానందం దగ్గర అబద్ధాలు కనిపెట్టే మిషన్ ఉంటుంది. అలీని ఓ కేసులో బ్రహ్మానందం ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆ సమయంలో అలీ అబద్ధం చెప్పిన ప్రతిసారి మిషన్ అరుస్తుంది. ఇలాగే, మనం రోడ్లపై చెత్త వేసిన ప్రతిసారి మిషన్ అరిస్తే ఎలా ఉంటుంది?
రోడ్లపై చెత్త వేయొద్దని జీహెచ్‌ఎంసీ ఎంతగా చెబుతున్నా చాలా మంది వినిపించుకోరు. బస్సుల్లో నుంచి వెళ్తూ కొందరు కిటిల్లోనుంచే పేపర్లు పడేస్తారు. రోడ్డుపక్కన దుకాణంలో కొనుక్కుని తిని రోడ్డుపైనే అందుకు సంబంధించిన చెత్తను పడేస్తుంటారు. బైకుపై వెళ్తూ రోడ్డుపైనే చెత్తను పడేస్తూ వెళ్తుంటారు కొందరు. ఇంట్లోని చెత్తను మోసుకొచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు.
ఇటువంటి వారందరినీ పసిగట్టి ఓ మిషన్ అరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జీహెచ్‌ఎంసీ అధికారులకు కూడా వచ్చింది. అంతేకాదు, రోడ్డు మీద చెత్త వేస్తే కిస్సిక్ మంటూ ఫొటో కూడా తీస్తుంది ఈ మిషన్. దీన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేశారు. అక్కడి ఓపెన్ గార్జేజీల వద్ద వాయిస్ అసిస్టెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇది విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లోనూ ఈ వాయిస్ అసిస్టెన్స్‌ను ఏర్పాట్లు చేయనున్నారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీపై నారా లోకేశ్ ప్రకటన
బంజారా హిల్స్‌లో ఓపెన్ గార్బేజీల వద్ద ఏర్పాటు చేసిన వాయిస్ అసిస్టెన్స్ కెమెరా ఎవరైనా చెత్త వేసేందుకు వస్తే ఫొటో తీస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీనగర్ లో ఓపెన్ గార్బేజీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన వాయిస్ అసిస్టెన్స్ కెమెరా సెన్సార్.. ఎవరైనా చెత్త వేస్తే వారిని గుర్తిస్తోంది. అనంతరం వాయిస్ కంట్రోల్‌కు అది సందేశం పంపుతుంది.
ఆ వెంటనే అక్కడ చెత్త వేయకూడదని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మైకు అరుస్తుంది. ఈ ప్రయోగం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఇక్కడ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే జూబ్లీహిల్స్ సర్కిల్ 18లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వాయిస్ అసిస్టెన్స్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే వెంటనే స్థానిక ఎస్ఎఫ్ఎ, చెత్తను సేకరించే ఆటో రిక్షా కార్మికుడికి కూడా సందేశంతో పాటు వీడియో, ఫొటో వెళ్తాయని అంటున్నారు. చెత్త వేస్తున్న వారిని దీని ద్వారా గుర్తించి ఇటువంటి పనులు చేయకూడదని చెబుతారని అన్నారు.
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) డంపర్‌బిన్లలో చెత్త దాదాపు 75 శాతం నిండగానే అలర్ట్ చేసేలా ఆధునిక డంపర్‌బిన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే విధించే పెనాల్టీలకు ఇకపై ఈ చలాన్‌లను జారీ చేయనుంది. అలాగే, యూపీఐ చెల్లింపుల ద్వారానే ఆ జరిమానాలకు స్వీకరించనుంది.