ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్నగోదావరి, కృష్ణా నదులు.. అప్రమత్తమైన అధికారులు.. పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.

Godavari River
Godavari River, Krishna River : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తూ కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుండటంతో త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.
గోదావరి, ప్రాణహిత నదులకు వరద పోటెత్తడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం జ్ఞాన సరస్వతి పుష్కరఘాట్లను తాకుతూ ప్రవాహం కొనసాగుతుంది. ఫలితంగా కాళేశ్వరం దగ్గర గోదావరి ఇప్పటికే సుమారు 10మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.
భారీగా వస్తున్న వరద నీటితో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ నీటితో కళకళలాడుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,19,500 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు పూర్తిస్థాయిలో 85గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25 అడుగులకు చేరుకుంది.
మరోవైపు.. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, ప్రస్తుత 693.325 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 6786 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1475 క్యూసెక్కులుగా ఉంది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెనుగంగ నదిలో 60వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం వల్ల భారీగా వరద ప్రవాహం చేరుతుంది. అదిలాబాద్ జిల్లా మత్తడివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 277.50మీటర్లు, ప్రస్తుతం 276.20మీటర్లు. ఇన్ ఫ్లో 860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 859.14 క్యూసెక్కులుగా ఉంది.
కొమురం భీం జిల్లా ఆడ ప్రాజెక్టు (ప్రాణహిత ఉపనది) మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు, ప్రస్తుతం 237.90మీటర్లు వద్దకు చేరింది. ఇన్ ఫ్లో 2176 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3474 క్యూసెక్కులుగా ఉంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కృష్ణానదికి పోటెత్తుతున్న వరద నీరు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,08,867 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,11,043 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లుకాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 317.460మీటర్లుగా ఉంది. ఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రాలలో ఐదు యూనిట్లలో ఉత్పత్తి అవుతుంది, దిగువ జూరాల జల ఉత్పత్తి ఆరు యూనిట్లలో ఉత్పత్తి అవుతుంది.
జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద శ్రీశైలం జలాశయంకు చేరుతుంది. అక్కడి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,48,736 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 13,566 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులుకాగా.. ప్రస్తుత నీటి మట్టం 544 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312,0450 కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 196.1229 టీఎంసీలు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.