Godavari Express: అరుదైన మైలురాయిని అందుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఏంటది?

గోదావరి ఎక్స్‌ప్రెస్ అంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వాసులకు రైలు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. అంతలా ప్రయాణికుల జీవితాల్లో భాగమైపోయిందీ ట్రైన్.

Godavari Express: అరుదైన మైలురాయిని అందుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఏంటది?

Godavari Express Train completes 50 Glorious Years

Updated On : February 2, 2024 / 5:17 PM IST

Godavari Express 50 Years: గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఈ రైలు సుపరిచితం. హైదరాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ఈ రైలుబండితో ఆ ప్రాంత వాసులకు ఎంతో అనుబంధం ఉంది. వైజాగ్ వెళ్లే ప్రయాణికులు ముందుగా ప్రిఫర్ చేసే రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు కూడా గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. ప్రయాణ వేళలు అందరికీ అందరికీ అందుబాటులో ఉండటం ఈ రైలు ప్రత్యేకత. అందుకే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఎల్లపుడూ పాసింజర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ రైలు రిజర్వేషన్ టికెట్ దొరకాలంటే కనీసం నెల రోజుల ముందు బుక్ చేయాలి. అంతలా ఆదరణ పొందింది ఈ రైలు.

50 ఏళ్లు పూర్తి.. 
ఉత్తరాంధ్ర వాసుల అభిమాన ట్రైన్ అయిన గోదావరి ఎక్స్‌ప్రెస్ అరుదైన మైలురాయిని అందుకుంది. ఫిబ్రవరి 1 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974 ఫిబ్రవరి 1న మొదటి సారిగా గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. 7007, 7008 నంబర్లతో మొదట ఈ రైలు నడిచేది. ఇప్పుడు 12727, 12728 నంబర్లతో రాకపోకలు సాగిస్తోంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లి స్టేషన్ లో రైల్వే అధికారులు సెలబ్రేషన్ నిర్వహించారు. రంగురంగుల తోరణాలతో తమ అభిమాన రైలును అందంగా అలంకరించారు. ప్రయాణికులు కేక్ కట్ చేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తన సొంతూరు వెళ్లడానికి 25 ఏళ్లుగా గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నట్టు గాజువాకకు చెందిన సురేశ్ కండెపు అనే టెకీ తెలిపారు. 1982 నుంచి ఈ రైలుతో తనకు అనుబంధం ఉందని బంకా హరి కృష్ణ ప్రసాద్ అనే బ్యాంక్ మేనేజర్ చెప్పారు. స్టేట్ బాస్కెట్‌బాల్ టీమ్ సెలక్షన్ కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు మొట్ట మొదటిసారి వచ్చినప్పుడు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కానని గుర్తు చేసుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో డ్యూటీ చేయడం హాయిగా ఉంటుందని రైలు చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రవూఫ్ అన్నారు. ప్రయాణికులు ఎంతో మర్యాదగా నడుచుకుంటారని వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నంలోనూ కేకులు కట్ చేశారు.

Also Read: వేలంలో నిమ్మకాయ.. ధర రూ.1.5 లక్షలు.. అంత ప్రత్యేకత ఏంటి?

టైమింగ్ సూపర్
గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సక్సెస్‌కి ప్రధాన కారణం అనువైన ప్రయాణ సమయం. సాయంత్రం రైలు ఎక్కితే మరసటి రోజు ఉదయానికి గమ్యానికి చేరుకుని పనులు చక్కబెట్టుకోవచ్చు. అందుకే ప్రయాణికులు ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తుంటారు. విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాంపల్లి నుంచి సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరిన రైలు మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య 709 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తుంది.

Also Read: ఆన్‌లైన్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 టికెట్లు.. ధ‌ర ఎంత‌, ఎలా బుక్ చేసుకోవాలంటే..?