Telangana Electricity Employees : తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త.. 70,804 మందికి భారీ ప్రయోజనం..
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు (Telangana Electricity Employees ) ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Good news for Telangana Electricity Employees da hike
Telangana Electricity Employees : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 1.621 శాతం డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు. తాజా పెంపుతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 19.272 శాతానికి చేరుకుంది. ఇక ఈ పెరిగిన డీఏ అలవెన్స్ తక్షణమే అమల్లోకి రానుంది.
విద్యుత్ శాఖ పనితీరు, భవిష్యత్ అవసరాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ ఎక్కడా అంతరాయం లేకుండా సరఫరా కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, పట్టణీకరణ నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే 2035 నాటికి దాదాపు రెట్టింపు అయ్యే అవకాశముందని అంచనా వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
