Gossip Garage: ఈ నెలాఖరులోపు అన్ని పదవుల భర్తీకి కాంగ్రెస్ ప్లాన్..! ఏయే పోస్టులను భర్తీ చేయబోతున్నారు, రేసులో ఉన్న ఆశావహులెవరు..
దీంతో కాంగ్రెస్‌లో పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి.

Gossip Garage: సాధ్యమైనంత తొందరగా లోకల్ బాడీ పోల్స్ నిర్వహించాలి. కానీ అంతకంటే ముందే అన్ని పదవులు భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని పోస్టులన్నీ ఫిలప్ చేసేందుకు రంగం సిద్ధమైందట. ఈ నెలాఖరులోపు అన్ని పోస్టుల పంపకాలు పూర్తి చేయాలని..స్వయంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేనే డెడ్ లైన్ పెట్టారట. దీంతో కాంగ్రెస్‌లో పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకీ ఏయే పోస్టులను భర్తీ చేయబోతున్నారు? పదవుల రేసులో ఉన్న ఆశావహులెవరు?
ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరబోతున్నాయి. ఇటు పార్టీ పదవులు, అటు ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మంత్రులకు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు చొరవ తీసుకుని..పార్టీలో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పలుమార్లు చెబుతూ వచ్చారు.
లేటెస్ట్‌గా గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. అంతేకాదు పోస్టుల భర్తీపై డెడ్ లైన్ కూడా పెట్టారంటున్నారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టుల జాబితా సిద్ధం చేసి పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిన ఖర్గే..అందుకోసం పీసీసీ చీఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని ఆదేశించారట.
Also Read: పార్టీ ఆఫీస్‌కి రారు, ఏ కార్యక్రమానికి హాజరవరు..! ఆ నలుగురు పెద్ద మనుషులు ఎక్కడ? కారులోనే ఉన్నారా?
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లోకల్ బాడీ ఎన్నికలకు నిర్వహించాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్‌లోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆగస్ట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందట. అయితే ఈ లోపు పార్టీ నాయకత్వాన్ని ఎన్నికల సమరానికి రెడీ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా నామినేటెడ్ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో నేతలు నారాజ్‌లో ఉన్నారు. దీంతో సెకండ్ గ్రేడ్ లీడర్లను సంతృప్తి పరిచేందుకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారట.
ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో 38 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులను భర్తీ చేసిన సీఎం రేవంత్..మిగిలిన పదవులను కూడా పంచేయాలనుకుంటున్నారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీలను భర్తీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అన్ని కార్పొరేషన్ ఛైర్మన్లు, కమిటీలు, డైరెక్టర్లు కలిపి దాదాపు వంద మంది నేతలను అకామిడేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక మంత్రిపదవి రాని వారిని క్యాబినెట్ ర్యాంకున్న కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మల్లికార్జున ఖర్గే స్వయంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆరుగురు నేతలను పిలిచి మీకు బెర్త్ కల్పించలేమని చెప్పేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ప్రేమ్‌సాగర్ రావుకు, ఆర్టీసీ లేదా ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్‌ను మల్‌రెడ్డి రంగారెడ్డికి, రామ్మోహన్‌రెడ్డి, బాలునాయక్, ఆదిశ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డిలకు కూడా పలు కార్పొరేషన్ పోస్టులను ఆఫర్ చేశారట. ఇక మిగిలిన మూడు మంత్రి పదవులను కూడా ఈ నెలాఖరులోపు భర్తీ చేసే అవకాశాలున్నాయి.
ఈ నెల మూడో వారానికి ఆషాడ మాసం ముగియనుంది. శ్రావణం వచ్చాక మంచి రోజు చూసుకొని క్యాబినెట్ విస్తరణ చేసి..ఆగస్ట్‌లో లోకల్ బాడీ ఎన్నికల సమరానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారట నేతలు. పార్టీ పదవులు, కార్పొరేషన్ పోస్ట్‌ల కోసం లాబీయింగ్ చేస్తున్నారట. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం నెలాఖరులోపు పదవుల పంపకం పూర్తి అవుతుందా..? మరోసారి పిక్చర్ అబీ బాకీ హై అంటారా అనేది చూడాలి.