Gossip Garage: పార్టీ ఆఫీస్‌కి రారు, ఏ కార్యక్రమానికి హాజరవరు..! ఆ నలుగురు పెద్ద మనుషులు ఎక్కడ? కారులోనే ఉన్నారా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

Gossip Garage: పార్టీ ఆఫీస్‌కి రారు, ఏ కార్యక్రమానికి హాజరవరు..! ఆ నలుగురు పెద్ద మనుషులు ఎక్కడ? కారులోనే ఉన్నారా?

Updated On : July 5, 2025 / 10:45 PM IST

Gossip Garage: ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ భవన్‌కు రావడం లేదు. పోనీ ఢిల్లీలో రాజ్యసభకు వెళ్తున్నారా అంటే అదీ లేదు. అవును.. గులాబీ పార్టీలో ఉన్నదే నలుగురు ఎంపీలు. వాళ్లు కూడా రాజ్యసభ సభ్యులు. కానీ సదరు ఎంపీలు రాజ్యసభ నుంచి మొదలు తెలంగాణ భవన్ వరకు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. పార్టీ ఆఫీస్‌ వైపు కన్నెత్తి చూడటం లేదట. ఏ కార్యక్రమానికి ఆ ఎంపీలు హాజరవ్వట్లేదట. అందుకే సదరు ఎంపీలు ఎక్కడా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా ఎంపీలు? ఏంటా కథ?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌లో ఉన్నదే నలుగురు ఎంపీలు. వాళ్లు కూడా రాజ్యసభ సభ్యులే. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెల్వలేదు. దీంతో గులాబీ పార్టీలో ఉన్నది కేవలం రాజ్యసభ సభ్యులే ఉన్నారు. కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావులు బీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ కు చెందిన ఎంపీలు.

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ వైపు కన్నెత్తి చూడటం లేదట..!
ఈ నలుగురు పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. అందులో మరీ ముఖ్యంగా ముగ్గురు ఎంపీలైతే ఎక్కడా కనిపించడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా పాల్గొనడం లేదంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని పార్టీ వర్గాలే గుసగుసలు పెట్టుకుంటున్నాయి. అడపాదడపా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా..మిగతా ముగ్గురు ఎంపీలు పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డిలు ఎక్కడా కనిపించని పరిస్థితి.

అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌పై విమర్శలు చేసినా, పార్టీ అధినేత కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు గుప్పించినా ఈ నలుగురిలో ముగ్గురు ఎంపీలు సైలెంట్‌గానే ఉంటున్నారట. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఈ ఎంపీలు యాక్టీవ్‌గా పాల్గొనడం లేదంటున్నారు. తెలంగాణ భవన్‌లో కనీసం మీడియా సమావేశం కూడా పెట్టడం లేదని చెబుతున్నారు. ఈ నలుగురిలో పార్థసారథి రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు అయితే అసలే కనిపించడం లేదట.

రాజ్యసభలో నోరు కూడా మెదపరు..!
ఇక రాజ్యసభలో కూడా ఈ బీఆర్ఎస్ ఎంపీల పర్ఫామెన్స్ అంతంత మాత్రమేనట. తెలంగాణకు సంబంధించిన అంశాలపై రాజ్యసభలో గళమెత్తిన సందర్భాలు తక్కువేనని అంటున్నారు. చాలా వరకు రాజ్యసభలో కూడా నోరు మెదపరని..ఒకవేళ ఎప్పుడో ఒకసారి మాట్లాడినా అది కూడా ముక్తసరిగానేనని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నలుగురిలో వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డిలు రాజ్యసభలో అప్పడప్పుడు మాట్లాడినా..మిగతా ఎంపీలైన పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ఇప్పటివరకు మాట్లాడిన దాఖలాలే లేవట.

Also Read: బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఈసారి మహిళకు అవకాశం? రేసులో ఉన్న ఆ ముగ్గురు వీరే..!

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యక్రమాల్లో కూడా ఈ ఎంపీలు కనపడట్లేదట. కేవలం అధినేత కేసీఆర్ పాల్గొనే సమావేశాల్లో తప్ప మరే కార్యక్రమానికి వీళ్లు రారరని తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ నలుగురు ఎంపీలు అసలు పార్టీలో ఉన్నట్లా.? లేనట్లా.? అనే చర్చ జరుగుతుందట.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి వారికి ఎందుకు రాజ్యసభ పదవులు కట్టబెట్టారని వాపోతున్నారట బీఆర్ఎస్ నేతలు. రాబోయే రోజుల్లో అయినా ఈ ఎంపీలు మౌన వీడతారో? లేదో చూడాలి.