Congress Vs Brs: అధికార కాంగ్రెస్‌కు బీఆర్ఎస్లో ఆ ముగ్గురే టార్గెట్టా? ట్రిపుల్ కే పైనే సీరియస్ ఫోకస్ ఎందుకు?
అధికార కాంగ్రెస్..ప్రతిపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతున్న రాజకీయ దాడిని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది.
Congress Vs Brs: స్ట్రాంగ్ వాయిస్. ఎప్పటికప్పుడు విమర్శల దాడి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా..సోషల్ మీడియాలో అయినా..పబ్లిక్‌లో అయినా ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతల అటాకింగ్ తీరే వేరు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్..రేవంత్ సర్కార్ తీరుపై, కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్కార్‌పై దూకుడుగా దాడికి వెనకాడట్లేదు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా మన్నె క్రిశాంక్..స్కామ్‌లు, స్కీములు అంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఆ ముగ్గురు టార్గెట్‌గా అధికార కాంగ్రెస్ కూడా అన్నింటికీ రెడీ అయిపోయింది. బీఆర్ఎస్లోని ట్రిపుల్ కే పైనే అధికార పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టిందా? అందుకే కేసులు, అరెస్టుల దాకా వ్యవహారం వెళ్తుందా?
తెలంగాణలో టార్గెట్ పాలిటిక్స్ ట్రెండింగ్‌గా మారాయి. అధికార కాంగ్రెస్..ప్రతిపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతున్న రాజకీయ దాడిని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యువ నాయకుడు మన్నె క్రిశాంక్లను కంట్రోల్ చేసేందుకు అధికార పార్టీ పక్కా స్కెచ్ వేసి ముందుకు పోతోంది.
ఈ మధ్య కాంగ్రెస్ సర్కార్‌పై పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాల్లో కేటీఆర్ అటాకింగ్ డోస్ పెంచారు. ఇష్యూ ఏదైనా..సబ్జెక్ట్ మరేదైనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు కేటీఆర్. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో రేవంత్‌పై, అధికార పార్టీపై కాస్త గట్టిగానే అటాక్ చేశారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజాక్షేత్రంలో పవర్ ఫుల్ వాయిస్ వినిపించారు. సభలు, సమావేశాలతో ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్..ఇప్పటి నుంచి ఇక పూర్తిస్థాయిలో జనంలో ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుని గ్రౌండ్లోకి దిగుతోంది. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీలు అటకెక్కాయంటూ..కాంగ్రెస్ సభలు పెట్టిన చోటే కౌంటర్ మీటింగ్స్ పెడుతూ కేటీఆర్ విమర్శల దాడిని పెంచుతూ వస్తున్నారు.
కుట్రలో భాగంగానే కేటీఆర్ పై కేసులు..!
సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ కొరకరాని కొయ్యగా మారడంతో..వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో తమ నేత క్యారెక్టర్‌ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్. ఈ-కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ విచారణ వంటివి కేటీఆర్ ను కార్నర్ చేసే కుట్రలో భాగమేనంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
తనదైన స్టైల్లో కౌశిక్‌రెడ్డి అటాకింగ్ మోడ్..
ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..అధికార కాంగ్రెస్‌పై అటాకింగ్‌కు ఏ మాత్రం వెనకాడట్లేదు. అసెంబ్లీ లోపల, బయట రేవంత్ సర్కార్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తనదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలు, మంత్రులు, అధికారులపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయిపోయారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు కేసులు కౌశిక్ పై నమోదుకాగా..తాజాగా కరీంనగర్ దాడి బీజేపీ చేసినా…దానికి కాంగ్రెస్ సహకారం ఉందంటూ మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవన్నీ కౌశిక్‌ను సైలెంట్ చేసే ప్రయత్నాలే అంటున్నారు గులాబీ లీడర్లు. గత అసెంబ్లీ సెషన్లో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారంటే ఏ రేంజ్లో టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు..
మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై పదునైన విమర్శలు, స్కామ్‌లు అంటూ ఆరోపణలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన్నె క్రిశాంక్‌పై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్స్ వేదికగా తన వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న క్రిశాంక్..ప్రభుత్వంలో ఇంటర్నల్‌గా జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో క్రిశాంక్ కూడా అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారని..అందుకే ఆయన్ను టార్గెట్ చేసి మరీ ఒక కేసు అయిపోకముందే మరో కేసులో కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించారని అంటున్నారు.
తమ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్న నేతలను కాంగ్రెస్ కావాలనే టార్గెట్ చేస్తోందనేది గులాబీ పార్టీ వాదన. ఇలా బీఆర్ఎస్లో ట్రిపుల్ కే చుట్టూ కాంగ్రెస్ పార్టీ, పోలీసులు చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడే నేతలను ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే..ఎన్నికల నాటికి మరింత చెలరేగి పోతారనేది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. దీనిని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Also Read: కుట్ర జరుగుతోంది..! కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్..
