Arvind Vs Sanjay: అర్వింద్ వర్సెస్ సంజయ్.. జగిత్యాలలో అసలేం జరుగుతోంది.. వివాదం దేనికి?
మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పంచాయితీ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సంజయ్‌కి.. అంతకుమించి అన్నట్లుగా అర్వింద్ చేస్తున్న దాడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
- రాజకీయ జగడానికి కేరాఫ్‌గా జగిత్యాల..
- సంజయ్, అరవింద్ మధ్య ఏం జరిగింది?
- ఇద్దరు నేతలు ఉప్పు, నిప్పులా ఎందుకు మారారు?
Arvind Vs Sanjay: జగడానికి కేరాఫ్‌గా మారుతోంది జగిత్యాల. నిన్నటివరకు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య సాగిన పంచాయితీ. హద్దులు దాటిన ఆవేశం.. తూటాలను మించి పేలిన మాటలు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో కథ సుఖాంతం అనుకున్నారంతా ! కట్ చేస్తే ఇప్పుడు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్‌కు మధ్య పోరు మొదలైంది. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు మంచి సఖ్యతతో ఉన్న వీళ్లిద్దరు.. ఇప్పుడు ఉప్పు, నిప్పు అన్నట్లు మారిపోయారట. జగిత్యాలలో అసలేం జరుగుతోంది.. ఒక పంచాయతీ ముగియగానే మరో పంచాయతీ ఎందుకు మొదలైనట్లు…
జగిత్యాల కేంద్రంగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ మధ్య రోజురోజుకు డైలాగ్ వార్ ముదురుతోంది. ఇద్దరి మధ్య తూటాల్లా పేలుతున్న మాటలు.. జగిత్యాల పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయ్. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వివాదం రాజుకుంది. ఉద్దేశపూర్వకంగానే స్థల కేటాయింపుల్లో ఎమ్మెల్యే సంజయ్ జాప్యం చేస్తున్నారని.. ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. చల్గల్ గ్రామ శివారులో స్థలం ఇవ్వకుండా.. ఎక్కడెక్కడో స్థలాన్ని కేటాయిస్తున్నారంటూ అర్వింద్ మండిపడుతున్నారు. 10 ఎకరాల స్థలం అడిగితే.. కేవలం 2 ఎకరాలు మాత్రమే కేటాయిస్తూ జీవో ఇచ్చారని.. ఇదంతా ఎమ్మెల్యే సంజయ్ కుట్రే అంటూ డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు అరవింద్. దీనికి నిరసనగా జగిత్యాలలో ఆయన ధర్మదీక్షకు పిలుపునివ్వడం…. దానికి పోలీసులు అనుమతి నిరాకరించడం.. దీంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టడంతో.. జగిత్యాల సెంట్రిక్‌గా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
కోరిన చోటే భూమి ఇవ్వాలనడం కరెక్ట్ కాదు..
మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పంచాయితీ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సంజయ్‌కి.. అంతకుమించి అన్నట్లుగా అర్వింద్ చేస్తున్న దాడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో.. ఇక లైన్ క్లియర్ అయిందని సంజయ్ భావించారు. ప్రభుత్వ సహకారంతో జగిత్యాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించొచ్చని లెక్కలు వేసుకున్నారు. కట్ చేస్తే.. జీవన్ రెడ్డి ఇష్యూ అలా పక్కకు జరిగిందో లేదో.. ఇప్పుడు ఇలా అరవింద్ రూపంలో మరో గండం వచ్చినట్లు అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అయితే కేంద్రీయ విద్యాలయానికి భూములు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని.. అర్వింద్ కోరుతున్న చల్గల్ స్థలం ఇరిగేషన్ పరిధిలో ఉందని.. అక్కడ భూమిని ఇచ్చేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధం లేదంటున్నారు సంజయ్. అక్కడ కాకపోతే అంతర్గాం, టీఆర్ నగర్ పరిసరాల్లో అవసరమైన భూమిని కేటాయించేందుకు రెడీగా ఉన్నామని చెప్తున్నారు. తాను కోరిన చోటే భూమిని ఇవ్వాలంటూ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేయడం అర్థరహితమని మండిపడుతున్నారు.
సడెన్ గా సీన్ రివర్స్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి..
పొలిటికల్ మైలేజ్ కోసమే ధర్మదీక్ష పేరుతో అరవింద్ డ్రామాకు తెరతీశారని సంజయ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఆయన ఒకటి అంటే.. ఈయన రెండు అన్నట్లు ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో.. జగిత్యాల రాజకీయం సెగలు కక్కుతున్న పరిస్థితి. నిజానికి నిన్నమొన్నటి వరకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ మధ్య మంచి సఖ్యత కనిపించేది. ఒక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి వెళ్లి మరీ.. అభివృద్ధి విషయంలో పలు అంశాలు చర్చించారు. డెవలప్మెంట్ విషయంలో కలిసి పని చేయడంలో తప్పే లేదంటూ ఇద్దరూ ఉమ్మడిగా పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు కూడా! అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.
ఇద్దరిలో ఒకరిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం!
ఇద్దరి పంచాయితీకి నిజంగా ఇదే కారణమా.. అంతకుమించి ఏమైనా ఉందా అనే అనుమానం జగిత్యాలలో మొదలైంది. జీవన్ రెడ్డి లేదా సంజయ్‌లో ఒకరిని బీజేపీలోకి తెచ్చేందుకు అర్వింద్ ప్రయత్నించారని.. అది విఫలం అవడంతోనే జగిత్యాలలో స్ట్రాంగ్ అయ్యేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారన్న టాక్ నడుస్తోంది. అందుకే జగిత్యాలపై ఫోకస్ చేసి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
