Congress Government: స్థానిక ఎన్నికల వేళ.. రేవంత్ సర్కార్‌కు కొత్త టెన్షన్..! కాంగ్రెస్ ఎలా గట్టెక్కబోతోంది?
రాబోయే రోజుల్లో ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Congress Government: అప్పుడు యూరియా. ఇప్పుడు పత్తి కొనుగోళ్లు. లోకల్ పోరుకు ముందు తెలంగాణలో సరికొత్త రాజకీయం. అసలే నువ్వానేనా అన్నట్లుగా నడుస్తోన్న పొలిటికల్ ఫైట్‌లో..అప్పర్ హ్యాండ్ కోసం అటు కాంగ్రెస్..ఇటు బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ పెట్టిన రూల్స్‌లో రైతులు అవస్థలు పడుతున్నారని ఎక్స్‌పోజ్ చేస్తోంది బీఆర్ఎస్. గతంలోనూ స్థానిక ఎన్నికలకు సిద్ధమైన టైమ్‌లోనే యూరియా కొరత సర్కార్‌ను రోడ్డుకు ఈడ్చింది. ఇప్పుడు కాటన్ పాలిటిక్స్‌కు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. స్థానిక పోరులో కాంగ్రెస్ ఎలా గట్టెక్కబోతోంది? పత్తి కొనుగోళ్ల పంచాయితీకి పరిష్కారం వెతుకుతోందా?
జూబ్లీహిల్స్ బైఎలక్షన్ హడావుడి అయిపోయింది. ఇక ఇప్పుడు రూరల్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. పైగా రైతుల సమస్యలు హైలెట్ చేస్తేనే తమకు ప్రజాదరణ దక్కుతుందని లెక్కలు వేసుకుంటోంది కారు పార్టీ. ఈ క్రమంలోనే ఆదిలాబాద్‌లో కేటీఆర్, వరంగల్‌లో హరీశ్‌రావు పత్తి రైతులను కలిసి వాళ్లు ఎదుర్కొంటున్న అవస్థలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పత్తి కొనుగోళ్ల అంశం పెద్ద దుమారమే రేపుతోంది. సీసీఐ.. పెడుతున్న కొర్రీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ గొంతు కలుపుతోంది.
అప్పుడు యూరియా.. ఇప్పుడు కాటన్ టెన్షన్..
సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు పత్తి కొనుగోళ్ల అంశం తెరమీదకు రావడంతో అధికార కాంగ్రెస్ ఆందోళన చెందుతోందట. గతంలోనూ కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ అయిన టైమ్‌లోనే..యూరియా కష్టాలు అధికార పార్టీని కలవరపెట్టాయి. బస్తా యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయడం..అప్పటికి ఇప్పటికి తేడాను పోలుస్తూ బీఆర్ఎస్ అటాక్ చేసింది. దీంతో స్థానిక ఎన్నికలు పెడితే ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పేయడంతో కాంగ్రెస్ సర్కార్ బ్యాక్ స్టెప్ వేసిందన్న టాక్ ఉంది.
ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న వేళ పత్తి కొనుగోళ్ల ఇష్యూ చర్చకు దారి తీస్తోంది. ఇది కూడా రైతులకు ముడిపడిన అంశం. పైగా గ్రామీణ తెలంగాణలో ప్రభావం చూపిస్తుంది కూడా. అందుకే పత్తి కొనుగోళ్ల అంశాన్ని బీఆర్ఎస్ హైలెట్ చేస్తోందన్న చర్చ మొదలైంది. ఇదే అధికార పార్టీని కలవరపెడుతోందట. అయితే అప్పుడు యూరియా అయినా..ఇప్పుడు పత్తి కొనుగోళ్లు అయినా రెండూ కేంద్ర పరిధిలోనివే. యూరియా పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సి ఉన్నా..అడ్వాన్స్‌గా యూరియా తెప్పించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పత్తి కొనుగోళ్లు కూడా కేంద్రం పరిధిలోని సీసీఐ పర్యవేక్షణలో కొనసాగుతోంది.
సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే తెలంగాణ రైతంగానికి శాపంగా మారాయంటున్నారు. అయితే నిబంధనలు పెట్టింది సీసీఐ అయినప్పటికీ..రాష్ట్ర వ్యవసాయ శాఖ ముందుగానే మేల్కొని ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావంటోంది బీఆర్ఎస్. తమ హయాంలో రైతులకు చిన్న ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది. తేమ శాతం, ఫింగర్ ప్రింట్ విధానం అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుమ్మెత్తిపోస్తోంది అపోజిషన్. తేమ శాతం, సీసీఐ నిబంధనలను సడలించే వరకు పోరాడుతామంటోంది బీఆర్ఎస్.
ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ ప్లాన్..
అయితే అన్ని పార్టీల కంటే కారు పార్టీ పత్తి రైతుల అంశాలను హైలెట్ చేస్తోంది. అది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు ముందు. రాబోయే రోజుల్లో ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అధికార కాంగ్రెస్‌కు గుబులు పుట్టిస్తోంది. అటోఇటో జూబ్లీహిల్స్‌లో అయితే మంచి మెజార్టీతో గెలిచాం కానీ..స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునుగుతుందని టెన్షన్ పడుతోందట అధికార పార్టీ.
తెలంగాణలో ఈసారి 45.32 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందని లెక్కలు చెబుతున్నాయి. 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చిందట. సీసీఐ కొత్త నిబంధనలే ఇప్పుడు పత్తి కొనుగోళ్ల పంచాయితీకి కారణమవుతున్నాయి. పత్తి కొనుగోలు చేసే జిన్నింగ్ మిల్లులకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది సీసీఐ. ఎల్-1, ఎల్-2 ఎల్-3 విధానాన్ని తీసుకురావడంతో..కొత్త తలనొప్పులు వచ్చాయి.
తెలంగాణలో ఎకరాకు 10 నుంచి 14 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. కానీ ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామని షరతులు పెట్టింది సీసీఐ. జిన్నింగ్ మిల్లులు 325 ఉంటే..కొనుగోళ్లు చేసేందుకు 256 మిల్లులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీజన్ ప్రారంభమై నెల రోజులైనా..ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. చాలా మిల్లుల దగ్గర కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. అన్నదాతలకు తోడుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా రోడ్డెక్కుతోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లోకల్ పోరుకు ముందు కాటన్ పాలిటిక్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి.
Also Read: సైలెంట్ మోడ్.. జగన్ కంచుకోటలో నేతల మౌనరాగమెందుకు? క్యాడర్ పరిస్థితి ఏంటి?
