Gossip Garage : తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ చేసిన హితబోధ ఏంటి?
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలసని..

Pm Modi Targets Telangana (Photo Credit : Facebook)
Gossip Garage : ఇక మన ఫోకస్ తెలంగాణ మీదే. అధికారంలోకి రావాల్సింది మనమే. ప్రజలు కోరుకుంటున్నది కూడా మనల్నే. మొన్నే అవకాశం ఉండే. కానీ మనమే మిస్ చేసుకున్నాం. ఈసారి వదిలిపెట్టే ముచ్చటే లేదు. నైజాం గడ్డ మీద కమలం జెండా రెపరెపలాడాల్సిందేనని.. తెలంగాణ బీజేపీ నేతలకు తేల్చి చెప్పారట ప్రధాని మోదీ. కలసి పనిచేయండి..కదం తొక్కి పోరాడండి..మేమున్నామంటూ వెన్ను తంటారట. విభేదాలు, గ్రూప్ పాలిటిక్స్ మీద కమలం లీడర్లకు క్లాస్ పీకారట ప్రధాని. ఇంతకీ మోదీతో భేటీలో స్టేట్ లీడర్లు ఏం చర్చించారు.? రాష్ట్ర నేతలకు ప్రధాని చేసిన హితబోధ ఏంటి.?
విభేదాలు మానండి..గ్రూప్‌లు వీడండి అంటూ దిశానిర్దేశం..
విభేదాలు మానండి..గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి..కలిసిమెలిసి పనిచేయండి. ఇదీ తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ చేసిన దిశానిర్ధేశం. తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని..కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారట మోదీ. ఎవరికి వారే యమునా తీరే అన్న తీరును మార్చుకుని సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.
బేధాబిప్రాయాలు, సమన్వయ లోపమే కారణమని గుర్తించారా?
ఉన్నట్లుండి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు ప్రధాని. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే టీబీజేపీ నేతలతో మోదీ భేటీ చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో జెండా పాతాలని ఎప్పటి నుంచో ఎజెండాగా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. అయితే పార్టీ పెద్దలు ఆశించినంత స్థాయిలో తెలంగాణలో పార్టీ పుంజుకోవడం లేదట. ఇందుకు సవాలక్ష కారణాలున్నా.. అందులో ప్రధానమైంది రాష్ట్ర నేతల్లో బేధాబిప్రాయాలు, సమన్వయ లోపమే కారణమని ఢిల్లీ పెద్దలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులను..ప్రధాని మోదీ ఢిల్లీకి పిలుపించుకుని మరీ సమావేశం అయ్యారని అంటున్నారు.
రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకే ప్రధాని స్పెషల్ మీటింగ్..
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ సమావేశం అంత ఆశామాషీ కాదని చెబుతున్నారు. బీజేపీలో ఇలాంటి ప్రత్యేక సమావేశాలు జరగడానికి అంతర్గతంగా చాలా లెక్కలు ఉంటాయని, ఆ కోణంలోనే రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రధాని భేటీ అయి ఉండొచ్చని అంటున్నారు. చాలాకాలంగా తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి 8 ఎంపీ సీట్లు గెల్చుకుని సత్తా చాటింది. అవకాశం ఉన్నప్పటికి రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం లోపం వల్లే అనుకున్నంతగా రాణించడం లేదని, అదే పార్టీకి పెద్ద మైనస్ అని భావిస్తోందట అధిష్టానం.
స్వయంగా సమావేశమైన ప్రధాని మోదీ..
తెలంగాణ బీజేపీలో గ్రూపులు, వర్గ విభేదాలు, బేధాభిప్రాయాలు, సమన్వయ లోపం వంటి అంశాలపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా.. ఆ అవకాశాన్ని నేతలు అందిపుచ్చుకోలేకపోతున్నారని అభిప్రాయంతో ప్రధాని మోదీ ఉన్నారట. అందుకే బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షాను కూడా పక్కన పెట్టి మరీ తెలంగాణ బీజేపీ నేతలతో స్వయంగా మోదీ సమావేశం అయ్యారని తెలుస్తోంది.
బీజేపీకే అధికారం దక్కే అవకాశం ఉందన్న ప్రధాని..
తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రతి ఒక్కరిని పేరుపేరున యోగక్షేమాలు అడిగి తెలుసున్నారట ప్రధాని. ఆ తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఇకపై కలసి మెలసి పని చేయాలని చెప్పారని తెలుస్తోంది. విభేదాలు పక్కనపెట్టి..సమన్వయంతో కష్టపడి పనిచేయాలని దిశానిర్ధేశం చేశారని అంటున్నారు. ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని.. అందుకోసం ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట ప్రధాని. అంతే కాకుండా తెలంగాణ అభివృద్దికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలసని..బీజేపీకే అధికారం దక్కే అవకాశం ఉందని ప్రధాని అన్నట్లు చెబుతున్నారు నేతలు.
ఇన్నాళ్లు తలోదారి..ఇద్దరి ముగ్గురో గ్రూప్‌గా ఉన్న నేతలు..ప్రధాని మోదీ దిశానిర్ధేశం తర్వాతైనా కలసి పని చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. స్వయంగా ప్రధాని పిలిపించి మరీ సమావేశమై..సమన్వయంతో పని చేయాలని చెప్పినా.. రాష్ట్ర నేతలు విభేదాలను పక్కనపెట్టి పనిచేస్తారా లేదా అన్నది టైమే డిసైడ్ చేయాల్సిందే.
Also Read : గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా..రారా.? ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు..