కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద యుద్ధం.. అసలేంటీ వివాదం? ఎందుకింత దుమారం?

ఎందుకూ పనికి రాదనుకున్న బూడిద... కోట్లు కురిపించడం, రాజకీయంగా దుమారం రేపడమే ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద యుద్ధం.. అసలేంటీ వివాదం? ఎందుకింత దుమారం?

Fly Ash Row : జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందనేది సామెత… కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఈ బూడిదే లక్షలకు లక్షలు కురిపిస్తోంది. రాజకీయ నాయకులకు కాసుల పంట పండిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో బూడిద పూసుకునేందుకు.. సారీ, బూడిద రవాణాకు సహకరించేందుకు నేతలు పోటీ పడుతున్నారు. తమ పరపతే పెట్టుబడిగా లక్షలు సంపాదిస్తున్నారనే ఆరోపణలూ ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదో రాజకీయ వివాదంగా మారింది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలతో అధికార, ప్రతిపక్షాల మధ్య బూడిద యుద్ధం జరుగుతోంది.

అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బూడిద రవాణా వ్యవహరం రచ్చ కెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల పరస్పర విమర్శలతో రాజకీయ దుమారం రేపుతోంది. అధికారంలో ఉన్న పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమంగా బూడిద రవాణా సాగుతోందంటూ వసూళ్ల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రామగుండం నుంచి రాజీవ్ రహదారి మీదుగా హుజురాబాద్, వరంగల్ మార్గంలో నిత్యం పెద్ద ఎత్తున బూడిద రవాణా జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలం కుందనపల్లి చెరువు నుంచి ఇతర ప్రాంతాలకు కొన్నేళ్లుగా బూడిదను తరలిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడే తడి, పొడి బూడిదను కుందనపల్లి చెరువులో నింపుతుంటారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ యాష్ ఫాండ్ లో రోజూ టన్నుల కొద్ది బూడిదను డంప్ చేస్తారు.

ఎమ్మెల్యే ఆందోళనతో సీక్రెట్ గా సాగుతున్న దందా గుట్టురట్టు..
ఇక్కడి బూడిదను రోడ్ల నిర్మాణానికి, ఇటుకల తయారీకి, సింగరేణి బొగ్గు గనులకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ బూడిద విక్రయం, రవాణా ద్వారా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు ఈ బూడిదను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన లోడుతో బూడిద తరలిస్తున్నారని ఆరోపిస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆందోళనకు దిగడంతో సీక్రెట్ గా సాగుతున్న దందా గుట్టు రట్టు అయింది. ఈ వ్యవహరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి.

కౌశిక్ రెడ్డికి మాత్రమే అభ్యంతరం ఎందుకు?
రామగుండం నుంచి ఖమ్మం వరకు వెళ్తున్న లారీల్లో బూడిద తరలిస్తున్నా, ఏ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం లేదని, కేవలం కౌశిక్ రెడ్డికి మాత్రమే అభ్యంతరం ఎందుకని ఎదురు ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. కేవలం మాముళ్ల కోసమే ఆందోళనలు, ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు ఈ ఆరోపణలపై కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.

కాసుల వర్షం కురిపిస్తున్న బూడిద..
వాస్తవానికి బూడిద రవాణాకు ఎన్టీపీసీయే ఏజెన్సీలకు నియమించుకుంటుంది. ఐతే ఈ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ చేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో బూడిదకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో నేతలు చూసీ చూడనట్లు వ్యవహరించే వారు. కానీ, ఇప్పుడు బూడిద వినియోగం పెరిగి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు ఓవర్ లోడ్ చేస్తున్నారు. తొలుత రామగుండం ప్రాంతానికి చెందిన నేతలు మాత్రమే ఈ దందా నడిపే వారు. ఇప్పుడు బూడిదతో కాసులు కురుస్తుండటంతో అన్ని ప్రాంతాల నాయకులు ఈ దందాపై ఫోకస్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ముందుండి ఈ దందా నడుపుతుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివాదాన్ని ఈ కోణంలోనే చూస్తున్నారు పరిశీలకులు.

బూడిద తరలింపులో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు..
బూడిద తరలింపులో కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఒక లారీ 50 టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా, అదనంగా 15 నుంచి 20 టన్నులు రవాణా చేస్తున్నారు. ఇలా అదనంగా లోడ్ చేసిన బూడిదకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అందుకే బూడిద అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. ప్రస్తుతం మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య బూడిద వివాదం దుమ్ము రేపుతోంది. అవినీతి జరుగుతుందంటూ ప్రమాణాలు చేసేటంతవరకు వెళ్లింది. ఈ వివాదం క్రమంగా తీవ్రమవుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునే వరకు వెళ్లింది. ఏదిఏమైనా ఎందుకూ పనికి రాదనుకున్న బూడిద… కోట్లు కురిపించడం, రాజకీయంగా దుమారం రేపడమే ఆసక్తికరంగా మారింది.

Also Read : 33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్