Gossip Garage: ఏడాది వ్యవధిలోనే ముగ్గురు మారారు.. గ్రేటర్ కమిషనర్లకు కాలం కలిసి రావడం లేదా? అసలు బల్దియా బాస్‌లకు ఏమవుతోంది?
తాజాగా ఆయన వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగడం బల్దియాలో హాట్ టాపిక్ అయింది.

Gossip Garage: బల్దియాకు బాస్‌లు వస్తున్నారు, పోతున్నారు. ఏడాది కాలంలోనే ముగ్గురు కమిషనర్లు వచ్చారు…వెళ్లారు. ఇప్పుడు బల్దియాను నాలుగో కమిషనర్ నడిపిస్తున్నాడు. ఏ ముహూర్తాన వాళ్లు GHMC ఆఫీస్‌లో అడుగు పెడుతున్నారో కానీ..కాంట్రవర్సీలు, వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా బల్దియా బాస్ ఆర్‌వి కర్ణన్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం కాగా…తాజాగా ఆయన వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగడం బల్దియాలో హాట్ టాపిక్ అయింది. గ్రేటర్ కమిషనర్లకు కాలం కలిసి రావడం లేదా.? అసలు బల్దియా బాస్‌లకు ఏమౌతోంది.?
తెలంగాణకు తలమానికం భాగ్యనగరం. హైదరాబాద్ మహానగరాన్ని శాసించే బల్దియా బాస్‌లు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికే నలుగురు కమిషనర్లు మారారు. రోనాల్డ్ రాస్ తర్వాత ఆమ్రపాలి..ఇలంబర్తి…ఇలా కమిషనర్లు వస్తున్నారు..అలా చూస్తుండగానే పోతున్నారు. ఇక తాజాగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన ఆర్‌వీ కర్ణన్ చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి.
సరిగ్గా గాడిలో పెట్టే టైమ్‌లోనే కమిషనర్ల మార్పు..
కారణాలేవైనా తరచూ కమిషనర్లు మారుతుండటంతో బల్దియా పరిస్థితి గందరగోళంగా మారింది. ఇలంబర్తి కమిషనర్‌గా ఉన్నప్పుడు లోపాలను సరిదిద్ది, అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారన్న చర్చ ఉంది. అనేక అంశాలు గాడిన పడుతున్నాయన్న సందర్భంలోనే అనూహ్యంగా ఆయన్ను బదిలీ చేయడంతో..పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి కూడా GHMCని అర్థం చేసుకొని, గాడిలో పెట్టే టైమ్‌లోనే బల్దియా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తరచుగా కమిషనర్లను మార్చడం..అభివృద్ధి పనులు నిలిచిపోవడం..నిధుల కొరత కారణంగా జీహెచ్‌ఎంసీలో పాలన పడకేసే పరిస్థితి వచ్చిందంటున్నారు.
ఇక తాజాగా GHMC కమిషనర్‌గా వచ్చిన ఆర్‌వి కర్ణన్ తీరుపై ఏకంగా ఉద్యోగులు ఆందోళన చేయడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఏ కమిషనర్ తీరుపై కూడా ఉద్యోగులు నేరుగా ఆందోళనకు దిగిన దాఖలాలు లేవు. శానిటేషన్‌లోని పర్మినెంట్ కార్మికులకు, శానిటరీ సూపర్ వైజర్లకు బయోమెట్రిక్ పెట్టాలని నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్లకు, బిల్ కలెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్ జారీ..అడ్వర్టైజ్‌మెంట్ ఫీజు వసూలు పనులు అప్పగించారు కమిషనర్ కర్ణన్.
నిబంధనల ప్రకారం ఆ పనులు లైసెన్స్ ఆఫీసర్లు లేదా మెడికల్ అధికారులు చేయాల్సి ఉండగా…తమకెందుకు అప్పగిస్తారంటూ కార్మికులు రోడ్డెక్కారు. కమిషనర్ చేసిన ఈ మార్పు ఇప్పుడు బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ముందు మాన్‌సూన్ టీమ్స్ కోసం ఈసుజి వెహికల్స్ కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచిన సమయంలోనూ కర్ణన్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయ్. దీంతో వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను ఏకంగా GHMC నుంచి తప్పించి హైడ్రాకు అప్పగించింది సర్కార్.
Also Read: కారులోనే సర్దుకుపోతారా..? కాషాయ కండువా కప్పుకుంటారా? మేడ్చల్ మల్లన్న దారెటు..
ఇక శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, సానిటరీ జవాన్లకు బయోమెట్రిక్ పద్ధతిలో అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించడంపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అడిషనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లను ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ కమిషనర్లుగా ఉన్న నలుగురు అధికారుల్లో ఇద్దరిని MAUDకి పంపించగా… మరొక ఇద్దరిని జాయింట్ కమిషనర్‌లుగా నియమించారు. దాంతో వాళ్లిద్దరు తమ పోస్టును తగ్గించారనే అసంతృప్తితో లాంగ్ లీవ్‌పై వెళ్ళిపోయారు.
మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ఒకేసారి 20మందికిపైగా డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ట్రాన్స్‌ఫర్‌లతో కొత్తగా వెళ్లిన ప్రాంతాల్లో వర్షాకాల ఇబ్బందులను పరిష్కరించడంలో సదరు డిప్యూటీ కమిషనర్లు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. బదిలీల విషయంలో కూడా కమిషనర్ అత్యుత్సాహంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయ్.
GHMCలో పనిచేసే ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు రెండు పనులను అదనంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇంతకాలం లైసెన్స్ ఆఫీసర్లు వసూలు చేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజు బాధ్యతను బిల్ కలెక్టర్లకు, ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్లకు అప్పచెప్పారు. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ ఫీజులు కూడా వారే వసూలు చేయాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఏకంగా కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. వేల కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు చేయడానికే తమకు టైమ్ సరిపోడం లేదని..కొత్తగా ఈ పనులు అప్పజెప్తే ఎలా పని చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు పని పెరిగిపోగా మరొకవైపు టార్గెట్లు రీచ్ కావడం లేదంటూ మెమోలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టం ప్రకారం ఇతరులు చేయాల్సిన పనులను తమతో చేయించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. వారి వాదనలోనూ నిజముందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎవరితో ఏ పని చేయించుకోవాలన్న అవగాహన లేకపోవడంవల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ముందు కమిషనర్ కర్ణన్ తీసుకుంటున్న నిర్ణయాలు సర్కార్‌కు సమస్యగా మారే అవకాశాలున్నాయన్న టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల దాకా అయిన ప్రస్తుత కమిషనర్ ఉంటారా? లేదా అనుభవజ్జులెవరినైనా ఐదో అధికారిని కమిషనర్‌గా సర్కార్ దింపుతుందో చూడాలి మరి..