BRS Plenary: ఈసారి సింపుల్గా గులాబీ ప్లీనరీ..! కారణం అదేనా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటూ..రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.
- ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- ఈసారి సింపుల్గా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- పార్టీ ప్రతినిధుల సభగా బీఆర్ఎస్ ప్లీనరీ..!
- 5 వేల మందితో ఆవిర్భావ దినోత్సవ సభ
BRS Plenary: పార్టీ పుట్టి 26 ఏళ్లు. ఉద్యమం, అధికారం, ఇప్పుడు ప్రతిపక్షం. ఈ క్రమంలో గతేడాదే రజతోత్సవ సంబరాలను గ్రాండ్గా నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సారి మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్లీనరీని.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నిర్వహించబోతున్నారట. సాదాసీదాగా కానిచ్చెయ్యాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్ కేసీఆర్. బహిరంగ సభలా కాకుండా ప్రతినిధుల సభ పెట్టబోతున్నారట. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించి..5 వేల మంది ప్రతినిధులతో ప్లీనరీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
పుష్కర కాలం ఉద్యమం, పదేళ్ల అధికారం..ఇప్పుడు రెండేన్నరేళ్ల ప్రతిపక్షం. ఇలా 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటూ..రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే..బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తోంది. గతేడాది ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవాలను వరంగల్లో పెద్ద స్థాయిలో నిర్వహించింది గులాబీ పార్టీ. ఈసారి మాత్రం చాలా సింపుల్గా కానిచ్చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పడున్న పరిస్థితుల్లో హడావుడి లేకుండా..ఆవిర్భావ దినోత్సవం రోజు చిన్న ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారట. బహిరంగ సభలా కాకుండా కేవలం ప్రతినిధుల సభగా ప్లీనరీని జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కవిత పార్టీకి అనవసర ప్రచారం అవుతుందనే ఆలోచన..!
ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తున్న కవిత..పార్టీ ప్రకటన సందర్బంగా ఏం కామెంట్స్ చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఆమె ఏం మాట్లాడినా రెండు రోజుల తర్వాత జరిగే బీఆర్ఎస్ ప్లీనరీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని గులాబీ పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఇప్పటిలాగే మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాగని కవిత కామెంట్స్ పై స్పందించడం కూడా ఆ పార్టీకి అనవసర ప్రచారం అవుతుందనే భావనలో గులాబీ బాస్ ఉన్నారట. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సాధాసీదాగా నిర్వహించాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. పైగా గతేడాది రజతోత్సవాలను గ్రాండ్గా నిర్వహించామని.. ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి పార్టీ ఆవిర్భావ వేడులకు పెద్ద ఎత్తున నిర్వహిస్తే సరిపోతుందనే భావనలో కూడా గులాబీ నేతలు ఉన్నారట.
4 నుంచి 5 వేల మంది ప్రతినిధులతో ప్లీనరీ..!
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపే కొత్త కమిటీలను ప్రకటించాలని అధినేత కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను మినహాయించి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కంటే వారం రోజుల ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించి..ఆయా కమిటీల్లోని ప్రతినిధులతోనే ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారట. దాదాపు 4 నుంచి 5 వేల మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీని పెట్టాలని పార్టీ ముఖ్యనేతలకు అధినేత కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రతినిధుల సభగా నిర్వహించే ప్లీనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
