బీఆర్‌ఎస్‌ భవనాలను కూల్చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?

మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..

బీఆర్‌ఎస్‌ భవనాలను కూల్చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?

Updated On : September 20, 2024 / 1:09 AM IST

Gossip Garage : హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ బుల్డోజర్లకు లైన్ క్లియర్ అయినట్లేనా…? ఇప్పటికే హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న హైడ్రా బుల్డోజర్లు… ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లపైనా విరుచుకుపడే అవకాశముందా? కోర్టు తీర్పు నల్గొండకే పరిమితమైనా… మిగిలిన చోట కట్టిన అనుమతుల్లేని బీఆర్ఎస్ కార్యాలయాలపైనా సర్కార్ ఉక్కుపాదం మోపనుందా? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనుమతి లేని భవనాలను కూల్చేస్తే రాష్ట్రవ్యాప్తంగా నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్న భవనాలు ఎన్ని? అది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే పరిమితమా? మిగిలిన పార్టీ ఆఫీసులకూ వర్తిస్తుందా? సర్కార్ నిర్ణయమేంటి? కూల్చివేతల ప్రమాదం ఎదుర్కొంటున్న భవనాల లెక్క ఎంత?

అనుమతులు తీసుకోకుండానే పార్టీ ఆఫీసుల నిర్మాణం..
నల్లగొండలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలనే హైకోర్టు ఆదేశాలతో గులాబీ పార్టీలో అలజడి మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని భావించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించగా, కొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ ఆయా భవనాలపై ఫోకస్ చేసింది.

హైకోర్టులో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ..
ముందుగా నల్గొండలో బీఆర్ఎస్ భవన్‌కు అనుమతులు లేవని… ఆ భవనాలను కూల్చేయాలని రెండు నెలల క్రితం రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హుకుం జారీ చేయడంతో తేనె తుట్టె కదిలింది. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరికలతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నల్గొండతో సహా మిగిలిన చోట నిర్మించిన బీఆర్ఎస్ భవనాలపైనా బుల్డోజర్ యాక్షన్ ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హైకోర్టు తీర్పుతో కూల్చివేతలు మొదలవుతాయా?
ఏపీలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు లేవన్న కారణంతో రెండు నెలల క్రితం ఆ భవనాన్ని నేలమట్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఇక్కడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయగా, నల్గొండతోపాటు సూర్యాపేట, భువనగిరి, పెద్దపల్లి, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, జనగామల్లో భవనాలకు అనుమతిలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా కార్యాలయాలకు అప్పట్లోనే నోటీసులు జారీ చేశారు. ఐతే నల్గొండ భవనం విషయమై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడంతో మిగిలిన భవనాలపైనా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైకోర్టు లైన్ క్లియర్ చేయడంతో నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో మిగిలిన కార్యాలయాల వైపూ బుల్డోజర్లు వెళ్లనున్నాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

కూల్చివేస్తే బీఆర్ఎస్‌కు రాజకీయంగా దెబ్బే..
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మించాలని భావించిన ఆ పార్టీ హైకమాండ్… 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు స్థలాలను కొనుగోలు చేసి ఆఫీసులు నిర్మించింది. ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తయి కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడో ఒకటో రెండో మాత్రమే నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు అనుమతులు లేవన్న కారణంతో ఆయా కార్యాలయాలను కూల్చివేస్తే బీఆర్ఎస్‌కు రాజకీయంగా దెబ్బేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చివేస్తే ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వంపై ఆ పార్టీ విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో ప్రభుత్వం భవనాల కూల్చివేతకే మొగ్గు చూపుతుందా? లేక రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి.

గులాబీ దళాన్ని మానసికంగా దెబ్బతీయడం సాధ్యమా?
ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆకర్ష్ వల వేసిన కాంగ్రెస్…. 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత వైపు ఫోకస్ చేస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ నిర్మాణాలైనా ప్రభుత్వం తలుచుకుంటే క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. కానీ, బీఆర్ఎస్ అధిష్టానంపై మానసికంగా పైచేయి సాధించాలనే ఆలోచనతో కార్యాలయాలను కూల్చివేస్తే అది ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

Also Read : రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారా? కారణం అదేనా..

రేవంత్ సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది?
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు.. అలా ముందుకు వెళ్తే అనేక చోట్లు సామాన్యులు నిర్మించుకున్న భవనాలను కూల్చాల్సిన పరిస్థితి రావచ్చు.. దీంతో ప్రభుత్వం ఇప్పుడేం చేయబోతుందన్నది ఆసక్తిరేపుతోంది.