Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి..
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Telangana : రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇక ఉగాది రోజున మఠంపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దంపతులు పాల్గొననున్నారు. అనంతరం రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు.
Also Read : తాము పార్టీ మారలేదంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు.. ఎందుకీ కవరింగ్? పూర్తి వివరాలు..
రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని గతంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ మేరకు ఉగాది పర్వదినాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లో మఠంపల్లి వద్ద దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజున మఠంపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ దంపతులతో పాటు సీఎం రేవంత్ దంపతులు పూజల్లో పాల్గొంటారు.
వాస్తవానికి జనవరి నుంచే రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే దీన్ని లాంచ్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కొత్త రేషన్ కార్డుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనేదానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.
దీంతో పాత రేషన్ కార్డుదారులకే సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ ఈ సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఉగాది రోజున ఈ 89లక్షల పాత రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.