Telangana : ఒక్కరోజే 100 కోట్ల ఆదాయం.. రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి కాసుల వర్షం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 2900 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. సుమారు 63 కోట్లకు పైగా రాబడి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Telangana : ఒక్కరోజే 100 కోట్ల ఆదాయం.. రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి కాసుల వర్షం..

Updated On : December 30, 2024 / 12:24 AM IST

Telangana : తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది. వరుస సెలవులు రావడం, శనివారం మంచి రోజు అని నమ్మడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడాయి. దీంతో శనివారం అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. శనివారం ఒక్క రోజే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోనే అత్యధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్..
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోనే అత్యధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే నిన్న రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కావడంతో ప్రభుత్వానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం సమకూరింది. అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం రెండింతలుపైగా కొనుగోలుదారులు, అమ్మకందారులతో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలు కిటకిటలాడాయి.

Also Read : వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?

శనివారం మంచి రోజు కావడంతో..
బుధ, గురువారాల్లో క్రిస్మస్ సెలవులు రావడం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో శుక్రవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో వరుసగా సెలవులు వచ్చాయి. మూడు రోజుల పాటు వరుసగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవులు రావడం, శనివారం రోజు త్రయోదశి, మంచి రోజు కావడంతో చాలామంది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇక, సోమ మంగళవారం పనిదినాలు అయినప్పటికీ.. సోమవారం అమావాస్య కావడం, ఆ తర్వాత మంగళవారం కావడంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను చాలా మంది శనివారం రోజునే చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..
రిజిస్ట్రేషన్ల సమయం అయిపోయినా.. వినియోగదారులను వెనక్కి పంపకుండా అర్థరాత్రి వరకు ఈ ప్రక్రియను కొనసాగించారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ కంటే శనివారం రెట్టింపు సంఖ్యలో దాదాపు 12వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి శనివారం ఒక్క రోజే 100 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరినట్లు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 2900 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. సుమారు 63 కోట్లకు పైగా రాబడి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీ రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు సాధారణంగా 5వేల నుంచి 6వేల లోపే ఉంటాయి. కానీ, శనివారం ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల సంఖ్య 12వేలు దాటాయి.

 

Also Read : పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు ఆగ్రహం