జాగ్రత్త, నగరంలో భారీ వర్షం, రహదారులు జలమయం

నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, లింగంపల్లి పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్.నగర్‌లో కుండపోతగా వర్షం పడుతోంది. హస్తినపురంలో 9.8 సెం.మీ, కందికల్ గేట్ 7.2 సెం.మీ వర్షపాతం. సరూర్‌నగర్‌లో 6.8 సెం.మీ, చార్మినార్ 6.8 సెం.మీ, చాంద్రాయణగుట్ట 6.5 సెం.మీ,
మారేడుపల్లి 6.4 సెం.మీ, ఎల్బీనగర్ 6.4 సెం.మీ, తార్నాక 5.9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కొత్తూరులో 14 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, షాద్‌నగర్‌లో 13.5 సెం.మీ, షాబాద్‌లో 12 సెం.మీ వర్షపాతం, హయత్‌నగర్‌లో 9.8 సెం.మీ, శంషాబాద్‌లో 9.4 సెం.మీ వర్షపాతం సంభవించింది.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. కర్మన్ ఘాట్ నుంచి సరూర్ నగర్ చెరువు కట్టకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద నడుము లోతు వరకు నీరు చేరింది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందోనని జనాలు భయపడిపోతున్నారు.
ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే..వరద నీటితో జలకళ ఉట్టిపడుతోంది. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.