Telangana Rains : తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు..రెడ్ అలర్ట్
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Ts Rains
Heavy rains in Telangana : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో జోరుగా కురిసిన వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పోశాయి. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం గాలులతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రుతు పవనాల గాలుల ద్రోణి…ఢల్లీ, బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది.
సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ప్రభావంతో… మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడ లోతట్టుప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
తెలంగాణలోని పాలమూరు, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో తూప్రాన్‌లో అత్యధికంగా 10.8 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 10.4 సెంటీమీటర్లు, కొమురవెల్లి, నారాయణరావు పేట మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా పగలంతా రెండు చోట్ల భారీగా, 29 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 193 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్ లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బందనకల్ శివార్లలో రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా జలమయమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం 8 గంటల కుండపోతకు పెద్ద చెరువు అలుగు పోసింది. దీంతో మహబూబ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది.
మెదక్‌లోని బృందావన్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చెరుగు అలుగు పొర్లడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్‌స్టేషన్ జలదిగ్బంధమైంది. వికారాబాద్ జిల్లా ధారూరు వాగులోని చెక్‌డ్యామ్‌ను కొందరు దాటుతుండగా గోరయ్య అనే వ్యక్తి పట్టుతప్పి పడిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెరువులన్నీ నిండాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండడంతో వర్షపు, డ్రైనేజీ నీరు రోడ్లను ముంచెత్తింది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ చెరువు దగ్గర వరద నీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్ చెరువును ఆనుకుని ఉన్న కాలనీల్లో రహదారులపై వరద ప్రవాహం కొనసాగింది.