తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు

రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్న కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు

Telangana Weather Report

Updated On : April 6, 2024 / 1:25 PM IST

Telangana Weather Report : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాల్పుల ప్రభావం కూడా ఉండటంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఇవాళ వడగాల్పుల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ, రేపు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 13 జిల్లాల్లో 43.4 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు రెండుమూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావొచ్చని, అత్యవసరం అయితేతప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్న కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Also Read : Telangana Summer : నెల ముందే డేంజర్ బెల్స్, రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోల్వాయిలో 42.5 డిగ్రీలు, కోరుట్ల 42.5, నేరెళ్ల 42.4,మేడిపల్లి 42.2,ఇబ్రహీంపట్నం, గోధూర్ 41.8,జైనా 41.7 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇవాళ (శనివారం) అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో  అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (ఆదివారం) ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జోగుళాంబ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Also Read : Kcr : 4నెలల్లోనే ప్రాజెక్టులు ఎండిపోయాయి, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొన్నిచోట్ల ఈదురు గాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం.. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో, అదేవిధంగా.. సోమవారం అదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.