Hyderabad: హైదరాబాద్‌లో హై అలర్ట్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు..
హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Hyderabad: భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ మహానగరంలోనూ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తోపాటు, మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
ఐపీఎల్ మ్యాచ్, మిస్ వరల్డ్ పోటీలు కారణంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు కమిషనరేట్ల సీపీల ఆధ్వర్యంలో పోలీసులు అణువణువు పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్, చౌమహల్లా పాలస్ లను మిస్ వరల్డ్ సుందరీమణులు సందర్శించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోటల్స్ లో క్రికెటర్లు స్టే చేస్తున్నారు. ఆయా హోటల్స్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.